అసలు ఏం జరిగిందంటే.. | - | Sakshi
Sakshi News home page

అసలు ఏం జరిగిందంటే..

Published Tue, Nov 12 2024 12:22 AM | Last Updated on Tue, Nov 12 2024 12:22 AM

అసలు

అసలు ఏం జరిగిందంటే..

పంజాబ్‌చౌక్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు

ఆదిలాబాద్‌టౌన్‌: ఆరుగాలం కష్టపడి పండించిన పంట దిగుబడిని అమ్ముకునేందుకు పత్తి రైతుకు తిప్పలు తప్పట్లేదు. ఓ వైపు మార్కెట్‌లో మద్దతు, గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతుండగా.. దీనికితోడు సీసీఐ అధికారులు, ప్రైవేట్‌ వ్యాపారులు పత్తి కొనుగోలు చేయకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సోమవారం ఆది లాబాద్‌ మార్కెట్‌ యార్డుకు వందల సంఖ్యలో రైతులు పత్తి విక్రయించేందుకు తీసుకొచ్చారు. కొంత మంది ఒకరోజు ముందుగానే యార్డులో బండ్లను వరుసలో ఉంచారు. ఉదయం బీట్‌ నిర్వహించాల్సిన సీసీఐ అధికారులు, ప్రైవేట్‌ వ్యాపారులు మధ్యాహ్నం వరకు కూడా అక్కడికి రాలేదు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు ఆందోళనకు దిగారు. యార్డు నుంచి పంజాబ్‌చౌక్‌కు చేరుకుని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు రైతుల వద్దకు వచ్చిన మార్కెటింగ్‌ అధికారులు కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

రైతుల ఇక్కట్లు

ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో సోమవారం దాదాపు 500కు పైగా బండ్లలో రైతులు పత్తి దిగుబడిని తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం 9గంటలకు వేలం ద్వారా ప్రైవేట్‌ వ్యాపారులు ధర నిర్ణయిస్తారు. సీసీఐ మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో తిండి తిప్పలు మానేసి రైతులు చెట్ల కింద కూర్చుంటూ అవస్థలు పడ్డారు. ఉదయం తీసుకొచ్చిన పత్తి బండ్లు మధ్యాహ్నం వరకు ఖాళీ అయ్యి తిరిగి వెళ్లేవారు. అలాంటిది మధ్యాహ్నం వరకు కూడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. వెయిటింగ్‌ చార్జీతో పాటు వాహన అద్దె పెంచుతామని వాహనదారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. ప్రైవేట్‌ వ్యాపారులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ప్రైవేట్‌ వ్యాపారులు సిండికేట్‌ అయ్యారనేది తేటతెల్లం అవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు యార్డులో వేలం ద్వారా వ్యవసాయశాఖ అధికారులు ధర నిర్ణయించేందుకు వచ్చారు. ఐదారుగురు వ్యాపారులే అక్కడికి చేరుకున్నారు. రూ.7,100తో ధరప్రారంభించగా, ఆ తర్వా త రూ.10 చొప్పున పెంచు తూ రూ.7,150గా నిర్ణయించారు. తర్వాత ధర పెంచేందుకు ససేమిరా అన్నారు. గత్యంతరం లేక రైతులు ఆ ధరకే విక్రయించాల్సి వచ్చింది. గంటల తరబడి నిరీక్షించినా చివరికి మద్దతు ధర కూడా లభించని పరిస్థితి. సీసీఐ తేమ పేరిట కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయకపోగా, ప్రైవేట్‌ వ్యాపారులు సిండికేట్‌గా మా రి రైతులను నట్టేటా ముంచుతున్నారు.

దిగుబడి అమ్మేందుకు తప్పని తిప్పలు నిబంధనలతో సీసీఐ తిరకాసు ముందుకురాని ప్రైవేట్‌ వ్యాపారులు రైతుల ఆందోళనతో కొనుగోళ్లు షురూ

వ్యాపారుల సిండికేట్‌..

ధర లేదు.. అంతా దగానే

ఆదిలాబాద్‌ మార్కెట్‌లో పత్తికి ధర లేదు. అంతా దగా చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు సైతం అవస్థలు పడాల్సి వస్తుంది. కనీసం పెట్టుబడి కూడా అందని పరిస్థితి ఉంది. మద్దతు ధర లభించడం లేదు. గిట్టుబాటు కాకపోయినప్పటికీ గత్యంతరం లేక ప్రైవేట్‌ వారికి అమ్ముకుంటున్నాం.

– యాదవ్‌రావు, రైతు, బెల్సారి రాంపూర్‌

సమాచారం ఇవ్వకనే తిప్పలు

నాకు నాలుగెకరాల భూమి ఉంది. పత్తి వేశాను. దాదాపు 35 క్వింటాళ్ల దాకా వచ్చిన దిగుబడిని అమ్మేందుకు ఆదిలాబాద్‌ మార్కెట్‌కు ఉదయమే వచ్చాను. మధ్యాహ్నమైనా కొనుగోళ్లు ఇంకా మొదలు పెట్టలే. చానా ఇబ్బందైతంది. పత్తి లోడ్‌ తెచ్చిన బండి ఓనర్‌ వెయిటింగ్‌ చార్జీ వేస్తానని అంటున్నాడు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చి ఇలా తిప్పలు పడాల్సి వస్తుంది.

– భూమన్న, రైతు, కుచులాపూర్‌

ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డు పరిధిలో పత్తి కొ నుగోలు చేసేందుకు 17 మంది జిన్నింగ్‌ వ్యాపారులు లైసెన్స్‌ కలిగి ఉన్నారు. సీసీఐ ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3 పేరుతో కొనుగోళ్లు చేపడుతోంది. జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ వ్యాపారులకు బేళ్ల ను తయారు చేసేందుకు గ్రేడింగ్‌ ప్రకటించారు. ఈ గ్రేడింగ్‌ ఆధారంగా మిల్లులకు పాయింట్లు కేటాయిస్తారు. ఎక్కువ పాయింట్లు వచ్చిన మిల్లు కు అధిక మొత్తంలో బేళ్లను తయారు చేసేందుకు పత్తిని ఇచ్చేందుకు అంగీకరిస్తారు. బేళ్లు తయారయ్యాక వారి నుంచి తిరిగి తీసుకుంటారు. ఈ యార్డులో రెండు కొనుగోలు కేంద్రాలు ఉన్నా యి. ఏ–సెంటర్‌లో తొమ్మిది ఫ్యాక్టరీలు, బి–సెంటర్‌లో ఎనిమిది ఉన్నాయి. అయితే జిన్నింగ్‌ వ్యాపారులకు బేళ్లను తయారు చేసేందుకు రూ.1,350 నిర్ణయించారు. ఈ ధర కంటే తక్కువతో తయారు చేసేవారికి, జిన్నింగ్‌ మిల్లులో వసతులు ఉన్నవారికి ఎల్‌–1 గ్రేడింగ్‌ ఇస్తారు. ఈ నిర్ణయాన్ని ప్రైవేట్‌ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. గ్రేడ్‌లు కేటాయించడంతో కొంత మందికే ఉపాధి లభిస్తుందని, మిగతా వారికి అన్యాయం జరుగుతుందని వారు పత్తిని కొనుగోలు చేసేందుకు, బేళ్లను తయారు చేసేందుకు నిరాకరిస్తూ నిరవధికంగా సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో సోమవారం ఆదిలాబాద్‌ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో సీసీఐ అధికా రులతో పాటు ప్రైవేట్‌ వ్యాపారులు సమావేశమైన తర్వాత తాత్కాలికంగా ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3 నిర్ణయాన్ని వాయిదా వేయడంతో కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అసలు ఏం జరిగిందంటే.. 1
1/4

అసలు ఏం జరిగిందంటే..

అసలు ఏం జరిగిందంటే.. 2
2/4

అసలు ఏం జరిగిందంటే..

అసలు ఏం జరిగిందంటే.. 3
3/4

అసలు ఏం జరిగిందంటే..

అసలు ఏం జరిగిందంటే.. 4
4/4

అసలు ఏం జరిగిందంటే..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement