రాజవొమ్మంగి : ఆన్‌లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా ఏదొక చోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా రాజవొమ్మంగిలో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి వద్దనే ల్యాప్ ట్యాప్ లేదా ఫోన్ ద్వారా ఉద్యోగం చేయండి, వారానికి రూ. 20వేలకు మించి ఆదాయం పొందండి అనే ప్రకటన చూసిన మహిళలు, యువతీ యువకులు అడ్డంగా బుక్కయ్యారు. రాజవొమ్మంగి పరిసరాల్లో ఓయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న దాదాపు వంద మంది రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు రెండు నెలల క్రితం సెల్ ఫోన్‌లో ‘ఏఎస్‌వో’ యాప్‌ను చూసిన ఆమె డౌన్ లోడ్ చేసుకుంది. వెంటనే మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. అయితే రూ. 20 వేలు చెల్లించాలంటూ మెసేజ్ వచ్చింది. అయితే అప్పటికే ఈ యాప్‌ను చైన్‌లింక్‌లా కొంతమంది రన్ చేస్తున్నారు. అంతేకాకుండా వారం వారం ఫోన్ పే ద్వారా సొమ్ము జమ అవుతున్నట్టు తెలుసుకున్న కొత్తవారు కూడా ఈ ఆన్‌లైన్ ఉచ్చులో పడ్డారు. మెసేజ్ మేరకు డబ్బులు జమ చేశారు. ఇలా రెండు నెలలు గడిచిపోయాయి. ప్రతి ఒక్కరు వారం వారం వస్తున్న ఆదాయాన్ని చూసి మురిసిపోయారు. అయితే ఉన్నట్టుండి ఈ యాప్ ఒక్కసారిగా సెల్‌ఫోన్లలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. భారీగా నష్టపోయినా బయటకు చెప్పేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. దీనిపై ఎస్‌ఐ నర్సింహమూర్తిని వివరణ కోరగా ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. అయినా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవడం విచారకరమన్నారు. ఈ మోసాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమగ్ర దర్యాప్తు చేస్తామని ఆయన వివరించారు.
ఉద్యోగాలకు ఆశపడి నష్టపోయిన
బాధితులు
రూ.లక్షల్లో చేజార్చుకున్న వైనం
ఉన్నతాధికారుల దృష్టికి మోసం:
ఎస్‌ఐ నర్సింహమూర్తి
Comments
Please login to add a commentAdd a comment