బడ్జెట్‌లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం
పాడేరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. ధర్మన్నపడాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్‌దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీల సంక్షేమానికి కేవలం రూ.7557 కోట్లు కేటాయించడాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. జనాభా 6.57 శాతం ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించాూల్సి ఉండగా కేవలం 2.57 శాతం మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. ఈ మేరకు రూ.19,374కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ.7557 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, బ్యాగ్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రస్తావనే లేదన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంపు, మౌలిక వసతుల కల్పన, జీసీసీ అభివృద్ధి, అటవీ ఉత్పత్తుల కొనుగోలు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం వంటి వాటికి నిధుల కేటాయింపు చేయకపోవడం సరికాదన్నారు. ఆదివాసీలను మోసం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. దీనిని నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దగా చేసిన కూటమి ప్రభుత్వం
అరకులోయ టౌన్: బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో ఆదివాసీలకు కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లోత రాంబాబు, కిల్లో సురేంద్ర విమర్శించారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్ అంకెల గారడీ బడ్జెట్‌గా ఆరోపించారు. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, జీవో నంబర్ 3 చట్టబద్ధతపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఆదివాసీలకు సముచిత స్థానం కల్పించకపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆదివాసీలకు జనాభా ప్రాతిపదికన కాకుండా కేవలం 2.57 శాతం మేర మాత్రమే కేటాయించడం సరికాదన్నారు.
అరకొరగా నిధుల కేటాయింపు
జనాభా ప్రాతిపదికన కేటాయించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment