పారదర్శకంగా పీసా ఎన్నికలు
పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఆదేశం
పాడేరు రూరల్: పీసా కమిటీల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోఆర్డీలు, మండల ప్రత్యేక అధికారులకు పీసా కమిటీల ఎన్నికల నిర్వహణపై సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పరిధిలో 239 పంచాయతీలతో పాటు మైదాన ప్రాంతమైన నాతవరం పరిధిలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 244 పంచాయతీల్లో 1,026 పీసా గ్రామాల్లో ఉపాధ్యక్ష,కార్యదర్శి పదవులకు వచ్చే నెల 3 నుంచి 7 వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ రహితంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో పీసా గ్రామాలకు చెందిన వారు ఎవరైనా పోటీ చేయవచ్చని ఆయన చెప్పారు. తహసీల్దార్లు తక్షణమే ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్. కుమార్ మాట్లాడుతూ ఎన్నికల అధికారులను నియమించే బాధ్యతను ఎంపీడీవోలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ భవనాల్లోనే ఎన్నికల నిర్వహించాలన్నారు. పీసా గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి ప్రభాకరరావు, ఇన్‌చార్జి డీడీ రజిని, ఆర్‌వోఎఫ్‌ఆర్ డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment