ఆజాద్ అడుగుజాడల్లో..
తుమ్మపాల: స్వతంత్ర భారత తొలి విద్యాశాఖామంత్రిగా భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన జాతీయ అవసరాలకు తగినట్లుగా విద్యావిధానం రూపొందించి, విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆజాద్ జయంతి వేడుకలను పురస్కరించుకుని మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ ఎం. జాహ్నవి, మైనారిటీ వర్గ ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా విద్యతోనే సాధ్యమన్నారు. ఆజాద్ ఆదర్శాలను అందరూ అనుసరించాలన్నారు. జామీ మసీదు ప్రెసిడెంటు పి.ఎస్.ఎన్.హుస్సేన్ మాట్లాడుతూ భారత దేశం మైనారిటీలకు ఉన్నత స్థానాలు, అత్యున్నత గౌరవం అందించిందని, ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. డీఆర్వో బి.దయానిధి, మైనారిటీ సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు సత్యపద్మ, షేక్ అబ్దుల్లా, మహమ్మద్ జిలానీ, ఉమర్ అబ్లుల్ అలీ, అబ్దుల్ రహమాన్, మహమ్మద్ అమన్, అబ్దుల్ గఫూర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విద్యారంగం బలోపేతం
అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి ఎస్పీ తుహిన్ సిన్హా పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నిర్విరామంగా పనిచేసి, జాతీయాభివృద్ధికి, విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారన్నారు. అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ బి.అప్పారావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment