ఘనంగా శూలాల మహోత్సవం
శూలాలు ధరించిన భక్తుడు
మునగపాక: ఉత్తరాంధ్రలో పేరుగాంచిన మునగపాక శూలాల మహోత్సవం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. కార్తీకమాసం రెండో సోమవారం ఈ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. సాంబశివుని ఆలయం నుంచి శూలాలు ధరించిన భక్తులు డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. శూలాల చివరన కండెలు వెలిగించి నృత్యం చేశారు. పలువురు భక్తులు నాలుక, బుగ్గల్లో శూలాలు ధరించగా మావూరి రాజు శరీరంపై భారీ శూలం ధరించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ శూలాల ప్రదర్శన గ్రామంలోని అన్ని వీధుల గుండా ఊరేగింపుగా సాగి మంగళవారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుంటుంది. ఈ శూలాల ప్రదర్శన తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివపార్వతుల ఫొటోలతో కూడిన గుమ్మటం అందరినీ ఆకట్టుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ పి.ప్రసాదరావు నేతృత్వంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment