ప్రజా సమస్యలకు సమర్ధంగా పరిష్కారం
తుమ్మపాల: మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సమర్ధంగా అమలు చేయాలని, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, కె.కె.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి, గృహనిర్మాణ శాఖ పీడీ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యల గూర్చి కూడా ప్రజలు జిల్లా కార్యాలయానికి వస్తున్నారని, అందువల్ల వారికి డబ్బు, సమయం వృథా అవుతున్నాయన్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రజలకు తెలియపరచాలన్నారు. ప్రతి అర్జీపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తీసుకున్న చర్యలను జిల్లా స్థాయిలో సమీక్షించడం జరుగుతుందని అన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను అర్జీదారులు జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో సమర్పించాలన్నారు. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, వచ్చిన ప్రతి అర్జీని అవగాహన చేసుకోవడం, అర్జీదారు వద్దకు వెళ్లి సమస్య గూర్చి మాట్లాడి, సమస్య సంబంధిత శాఖ పరిధిలోనిది కాకపోతే తెలియపరచడంతో పాటు అందుకు గల కారణాలను వివరించడం, తదుపరి కార్యాచరణపై అర్జీదారునికి అవగాహన కల్పించడం వంటి పంచ సూత్రాలను అధికారులు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 324 అర్జీలు నమోదయ్యాయి.
సెలవు పెడితే ఆయాగా తొలగించేశారు
ప్రమాదంలో తన భర్త కాలికి గాయమవడంతో పది రోజులు సెలవు పెట్టినందుకు తనను ఆయా పోస్టు నుంచి తొలగించి మరొకరిని చేర్చుకున్నారని కోట వురట్ల మండలం తంగేడు గ్రామానికి చెందిన కాళ్ల భవానీ అనే మహిళ అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఈమేరకు గాయాలతో ఉన్న భర్తతో పాటు తన ముగ్గురు పిల్లలతో ఆమె కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు అర్జీ సమర్పించింది. పాఠశాల హెచ్‌ఎంకు సెలవు చీటీ ఇచ్చి సెలవుపై వెళ్తే రాజీనామా చేశానంటూ తనను తొలగించి తనకు జీవనాధారం లేకుండా చేశారని, తనను ఆయాగా మళ్లీ చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసింది.
పింఛను మంజూరు చేయరూ..
ఒంటరిగా వృద్ధాప్యంలో ఉన్న తనకు పింఛను మంజూరు చేయడం లేదంటూ రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన కింతాడ భూలోకమ్మ అనేక వ్యయప్రయాసలతో కలెక్టరేట్‌కు చేరుకుని పీజీఆర్‌ఎస్‌లో అర్జీ చేసుకుంది. తనతో పాటు తన అక్క పేరు ఒకే రేషన్ కార్డులో ఉందని చెబుతూ గతంలో తనకు పింఛను తొలగించారని, తరువాత తన పేరున మరో రేషన్ కార్డు చేయించుకుని పింఛను కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా మంజూరు కాలేదని తెలిపింది. తనకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరింది.
జలాశయం ఆక్రమణలపై ఫిర్యాదు
రావికమతం మండలం గుడ్డప పంచాయతీ గొర్లాం గ్రామంలో గత 25 ఎకరాల మినీ జలాశయం ఆక్రమణకు గురైందని, తక్షణమే సర్వే చేపట్టి ఆక్రమణదారులను తొలగించి జలాశయాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని కోరుతూ గ్రామానికి చెందిన నాబారు కృష్ణ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. వందల ఎకరాలకు సాగు నీరందించే గొర్లాం చెరువు ఆక్రమణలతో కుచించుకుపోతుందని తెలిపారు. జలాశయం పరిరక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు ఆక్రమణదారులను ఓటర్లుగా చేర్చి మరీ చేపడుతున్న సాగునీటి సంఘాల ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని కోరారు.
హమాలీల కూలీరేట్లు పెంచాలి...
జిల్లాలో సివిల్ సప్లయి గోదాంలలో పనిచేస్తున్న హమాలీల కూలీల రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఏఈటీయుసీ, హమాలీల యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సరకు ఎగుమతి, దిగుమతి రేట్లు పెంచాలని, 2024 జనవరి నుంచి ఎరియర్స్ చెల్లించాలని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, పెండింగ్ పీఎఫ్ క్లెయిమ్‌లు చెల్లించాలని, మరణించిన హమాలీల కుటుంబాలకు పింఛను మంజూరు చేయాలని, 4వ తరగతి ఉద్యోగులుగా హమాలీలను గుర్తించాలని డిమాండ్ చేశారు.
మండల, వార్డు స్థాయిల్లో పీజీఆర్‌ఎస్ అమలు
కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment