రౌడీ రాజ్యం | - | Sakshi
Sakshi News home page

రౌడీ రాజ్యం

Published Tue, Nov 19 2024 1:33 AM | Last Updated on Tue, Nov 19 2024 1:33 AM

రౌడీ

రౌడీ రాజ్యం

రౌడీయిజం వారి వృత్తి.. రాజకీయం ప్రవృత్తి.. తెలుగుదేశం క్రియాశీలక సభ్యులు వారు.. ఆ పార్టీ అండతో చెలరేగిపోతారు.. వారు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఎవరూ సంచరించడానికి వీల్లేదు.. ఎవరైనా ఎదురుగా కనిపిస్తే చాలు తమను ధిక్కరించినట్టు భావిస్తారు.. వారి పనిపడతారు. నర్సీపట్నంలో సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే యువకుడి హత్య అలాగే జరిగింది. టీడీపీ నాయకుడు బండారు కొండబాబు, పార్టీ సాధారణ కార్యకర్త అయిన రౌడీ షీటర్‌ బండారు సంతోష్‌ అకారణంగా అతనిని పొట్టన పెట్టుకున్నారు. మృతుడి భార్య, ఇద్దరు పసిపిల్లలు అనాథలయ్యారు.

నర్సీపట్నంలో యువకుడి దారుణ హత్య

నిందితులిద్దరూ టీడీపీకి చెందినవారు

అయ్యన్న ఇలాకాలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

మృతుడి బంధువులు, గ్రామస్తుల ఆగ్రహం

పోలీస్‌ స్టేషన్‌, ఏరియా ఆస్పత్రి ముట్టడి

నర్సీపట్నం: హతుడికి, నిందితులకు పాత కక్షలు లేవు. హత్యకు గురైన నాగేశ్వరరావు అనుచితంగా ప్రవర్తించిందీ లేదు. కానీ క్షణాల్లో ప్రాణాలు తీశారు. టీడీపీ అండతో కలిగిన కండకావరమే అందుకు కారణం. అందుకే మృతుడి బంధువులు, గ్రామస్తుల్లో అంత ఆగ్రహం రగిలింది. హత్యను నిరసిస్తూ స్పీకర్‌ సిహెచ్‌.అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లేందుకు వారు బయలుదేరగా మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకుని నిలువరించారు. వెనుతిరిగిన మృతుడి బంధువులు టౌన్‌ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. హంతకులను అరెస్ట్‌ చేసి.. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. హత్యకు పాల్పడిన రౌడీ షీటర్‌ సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న బండారు కొండబాబును సాయంత్రంలోగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తామని టౌన్‌ సీఐ గోవిందరావు, రూరల్‌ సీఐ రేవతమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అకారణంగా ప్రాణం తీశారు..

టౌన్‌ సీఐ గోవిందరావు అందించిన వివరాల ప్రకారం.. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సర్వసిద్ధి నాగేశ్వరరావు(నాగు) (32) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌. నర్సీపట్నం కొత్తవీధిలో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహితులు ఎస్‌.సురేష్‌, పి.నవీన్‌, శంకర్‌లను భోజనానికి ఇంటికి తీసుకువచ్చాడు. ఆ దారి వెంబడి రావొద్దంటూ అక్కడ మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకుడు కొండబాబు, ఆ పార్టీ సాధారణ కార్యకర్త అయిన రౌడీషీటర్‌ సంతోష్‌ వారిని హెచ్చరించారు. భోజనం చేసి తిరిగి వెళ్తున్న మృతుడి స్నేహితుడు శంకర్‌ను మళ్లీ ఎందుకురా ఇలా వచ్చావంటూ బైక్‌ తాళాలు లాక్కొని సిగరెట్‌తో మెడపై కాల్చారు. శంకర్‌ వెళ్లి నాగేశ్వరరావును తీసుకురావడంతో ఇరువు వర్గాల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రౌడీ షీటర్‌ సంతోష్‌, టీడీపీ నాయకుడు కొండబాబులు నాగేశ్వరరావుపై దాడి చేశారు. స్పృహ కోల్పోయిన నాగేశ్వరరావును బంధువులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఐదు నెలల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం

నాగేశ్వరరావు హత్య విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సోమవారం ఉదయం టౌన్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులు ఇద్దరూ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ అండతో ఎంత మందిని హతమారుస్తారంటూ బంధువులు, గ్రామస్తులు ఆక్రోశం వెలిబుచ్చారు. హత్యను నిరసిస్తూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లేందుకు మూకుమ్మడిగా బయలుదేరారు. పోలీసులు నచ్చచెప్పడంతో వెనుతిరిగి టౌన్‌ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. హత్యకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటామని టౌన్‌ సీఐ గోవిందరావు, రూరల్‌ సీఐ రేవతమ్మ నచ్చజెప్పినా వారు శాంతించలేదు. మృతుడి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బొట్టా నాగరాజు ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రి ముందు కూడా ఆందోళనకు దిగారు. మెయిన్‌ రోడ్డుపై బైటాయించారు. దీంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. హంతకులను అరెస్టు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తేనే మృతదేహాన్ని తీసుకువెళ్తామని లేదంటే, తీసుకువెళ్లే ప్రసక్తి లేదని భీష్మించారు. మృతుడి భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కన్నీరు మున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. మృతుడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను స్పీకర్‌ సతీమణి చింతకాయల పద్మావతి సోమవారం రాత్రి పరామర్శించారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మోహన్‌

నర్సీపట్నం: సర్వసిద్ధి నాగేశ్వరరావును హత్య చేసిన నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ మోహన్‌ తెలిపారు. మద్యం మత్తు, ప్రేరేపిత మాటలే హత్యకు దారి తీశాయన్నారు. మృతుడి మేనమామ పల్లా అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టామన్నారు. సీఐ గోవిందరావు బృందం నేరం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారన్నారు. హత్యకు పాల్పడిన కొత్తవీధికి చెందిన రౌడీ షీటర్‌ బండారు సంతోష్‌ను సుబ్బారాయుడుపాలెం రాయల్‌ రిసార్ట్స్‌ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. బండారు కొండబాబును మాకవరపాలెం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. ఇద్దరు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాలతో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు.

బహిరంగంగా మద్యం తాగితే కేసులు పెడతామని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. కేడీ పేట, డౌనూరు ప్రాంతాల్లో రెండు పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. రౌడీ షీటర్లు ఎలాంటి అకతాయి చర్యలకు పాల్పడినా ఉపేక్షించేదిలేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రౌడీ రాజ్యం 1
1/3

రౌడీ రాజ్యం

రౌడీ రాజ్యం 2
2/3

రౌడీ రాజ్యం

రౌడీ రాజ్యం 3
3/3

రౌడీ రాజ్యం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement