కరువు బరువు
భద్రత
సంక్షేమం
నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో పెచ్చులూడి పడుతున్న డార్మెటరీ
రోలుగుంట బీసీ బాలుర వసతి గృహంలో తలుపులు లేని గదులు
శిధిలమయిన అద్దె భవనంలో రేవు పోలవరం బీసీ వసతి గృహం
స్లాబు పెచ్చులు ఊడిపోతున్న గదులు
నర్సీపట్నం ఎస్సీ హాస్టల్ దుస్థితి
శీతాకాలంలో చలిని తట్టుకునే దుప్పట్లు కరువు.. సగానికి పైగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో రక్షణ గోడలు కానరావు.. తలుపులు లేని బాత్‌రూమ్‌లు.. బాలికల హాస్టళ్లలోనూ ఏర్పాటు కాని సీసీ కెమెరాలు.. జూన్ నెల నుంచి అందని కాస్మొటిక్ చార్జీలు.. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో బితుకుబితుకుమంటూ విద్యార్థులు..
ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలకే సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయి. హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వ పర్యవేక్షణ డొల్లతనమంతా బయటపడింది. వసతి గృహాల్లో గదులకు తలుపులు, కిటికీలకు మెస్‌లు లేకపోవడంతో దోమలు విజృంభించి విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితులున్నాయి. శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాల నుంచి విద్యార్థులను తరలించాల్సి ఉన్నా ఆర్థిక భారంతో అధికారులు ముందడుగు వేయడం లేదు. సాక్షి ఫీల్డ్ విజిట్‌లో వెల్లడైన వాస్తవాలివి..
–సాక్షి, అనకాపల్లి
●అనకాపల్లిలో గుండాల జంక్షన్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 130 మంది ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు ఉంటున్నారు. అందరూ హాల్లోనే నేల మీద పడుకుంటారు. వర్షం పడితే బిల్డింగ్ అంతా జలమయమే.
●అద్దె భవనంలోనే కొనసాగుతున్న గవరపాలెం మహాత్మజ్యోతిబాపూలే వసతి గృహంలో ఇరుకు గదులు.. నీటి సదుపాయం నిల్
●గాంధీనగరం డీఎన్‌టీ హాస్టల్లో 100 మంది విద్యార్థులకు గదులు సరిపోడంలేదు.
●అంజికాలనీలో ఉన్న ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పెద్ద వర్షం పడితే రహదారిపై ఉన్న వర్షపు నీరు గదుల్లోకి వచ్చేస్తుంది. బాత్‌రూమ్‌ల దగ్గర పాముల సంచారం, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.
●విజయరామరాజుపేటలో నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఆవాసియా విద్యాలయ అర్బన్ హాస్టల్లో 103 మంది విద్యార్థులున్నారు. బాత్‌రూమ్‌లకు తలుపుల్లేవు. ఫ్యాన్‌లు సరిగ్గా తిరగవు. దోమల బెడద ఎక్కువ. సీసీ కెమెరాలు లేవు. తాగునీటి పైప్‌లు చిదిగిపోయాయి.
నర్సీపట్నం నియోజకవర్గంలో పెదబొడ్డేపల్లి బాలుర గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్ అధ్వానంగా ఉంది. డార్మెటరీ శిథిలావస్ధకు చేరింది.
●నర్సీపట్నం ఎస్సీ బాలుర వసతి గృహంలో భవనం స్లాబ్ పెచ్చులూడుతోంది. ●అద్దె భవనంలో కొనసాగుతున్న ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు జైలు వాతావరణంలో గడుపుతున్నారు. ●250 మంది విద్యార్థులున్న నర్సీపట్నం అబిద్‌సెంటర్‌లోని ఎస్సీ బాలుర వసతిగృహంలో బాత్ రూమ్‌లు చాలక విద్యార్థులు కాలకృత్యాలకు ఇబ్బందులు పడుతున్నారు. ●వేములపూడి ఎస్సీ బాలుర వసతిగృహంలో బాత్ రూమ్‌లు, రన్నింగ్ వాటర్ లేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ●నాతవరం ఎస్సీ బాలికల హాస్టల్లో మరుగుదొడ్లు, గొలుగొండ గురుకుల పాఠశాలలో భోజనం తయారు చేసే కిచెన్ శిథిలావస్ధకు చేరాయి. వర్షాలకు కిచెన్ స్లాబ్ పెచ్చులూడి పడుతోంది. పైకప్పు స్లాబ్ పెచ్చులూడి ఇనుప చువ్వలు వేలాడుతున్నాయి. ●తాండవ గిరిజన ఆశ్రమం ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన భవన నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి.
మాడుగుల మండలంలో సరసయ్యపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాత్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉండడం లేదు. ప్లే గ్రౌండ్ వర్షం వచ్చిన పది రోజుల వరకూ బురదమయంగా అధ్వానంగా ఉంటుంది.
●కోనాం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో బాత్రూమ్‌ల తలుపులు పాడయ్యాయి.
●తురువోలు బీసీ బాలుర వసతి గృహ భవనంలో వర్షం వస్తే భవనం పూర్తిగా తడిసి ముద్దవుతుంది.
●చీడికాడ మండలం అప్పలరాజుపురం బీసీ బా లుర హాస్టల్లో రెండు గదులు పాడయ్యాయి. వీటికి మరమ్మతులు చేపట్టి ప్రహరీ గోడ నిర్మించాలి. ●దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల వి ద్యాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతుకు గురయింది.
చోడవరం మండల పరిధి గోవాడలో బీసీ గర్ల్స్ హాస్టల్‌కు సొంత భవనం లేదు. 80 మంది పి ల్లలున్న ఈ భవనంలో వాటర్, బాత్‌రూమ్ సమస్యలున్నాయి.
●చోడవరం సమీపంలో గాంధీగ్రామ పంచాయతీ సిటిజన్ కాలనీలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహం అన్ని గదుల స్లాబులు పెచ్చులూడి పోయి ఉండడంతో పాటు వర్షాకాలం నీరు కారడం సహజంగా మారింది. విద్యార్థులకు 6 మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం అంతంత మాత్రం. ●పాయకరావుపేట పట్టణంలో గల నెంబర్–1ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. నెంబర్– 2 వసతి గృహంలో బాత్‌రూమ్‌లకు డోర్‌లు లేవు. లెట్రిన్‌లు సక్రమంగా లేవు. ●ఎస్.రాయవరం మండలంలో బీసి బాలుర హాస్టల్‌కు ప్రహరీ లేదు. గదుల్లో కిటికీలకు గ్రిల్స్ లేవు. కొన్ని గదుల తలుపులకు గడియలు లేకపోవడంతో విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారు. ●అద్దె భవనంలో ఉన్న రేవుపోలవరం బాలబాలికల హాస్టల్లో ప్రహరీ గోడ లేదు. ●కోటవురట్ల మండలం ఎస్సీ బాలికల వసతి గృహంలో ప్రహరీ కూలిపోవడంతో విద్యార్ధినులు ఆందోళన చెందుతున్నారు. భవనం స్లాబ్ పెచ్చులూడి పడుతోంది. ●యలమంచిలిలో బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 120 మంది విద్యార్థులున్నారు. వీరికి 9 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో కిటికీలకు అద్దాలు, కొన్ని గదులకు తలుపులు, ఫ్యాన్లు లేవు. టాయిలెట్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ●కొత్తపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో మోటర్ పాడైపోవడంతో 6 నెలలుగా నీటి సరఫరా జరగడంలేదు. ఉన్న ఒక చేతి బోరు కూడా పాడవడంతో పాత టైర్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులు పూర్తిస్థాయిలో లేవు. గాంధీనగరం బాలుర హాస్టల్లో వర్షం కురిస్తే వంటగది పై కప్పు నుంచి నీరు కారుతోంది. ●రాంబిల్లి మండలంలోని కేజీబీవీ వసతి గృహంలో విద్యార్థులకు రక్షణ గోడ లేదు.
మరుగుదొడ్లు, స్నానపుగదుల దుస్థితి
Comments
Please login to add a commentAdd a comment