భూముల సర్వే మతలబు ఏమిటో..!
● రైతుల్లో ఆందోళన ● పెదతీనార్ల, దొండవాకలలో జిరాయితీ, ప్రభుత్వ భూములపై ఆరా ● ఏపీఐఐసీ అదనపు భూసేకరణ కోసమేనని ప్రచారం ● స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై ఊహగానాలు ● గోప్యంగా ఉంచుతున్న రెవెన్యూ అధికారులు
నక్కపల్లి: తీరప్రాంత గ్రామాల్లో భూముల సర్వే కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట, నక్కపల్లి మండలం పెదతీనార్ల, దొండవాక గ్రామాల్లో రెవెన్యూ అధికారులు భూములు సర్వే చేస్తున్నారు. ఏపిఐఐసీ, రెవెన్యూ అధికారులు చేస్తున్న భూముల సర్వే రైతులను కలవరపెడుతోంది. ఎంపిక చేసిన భూముల్లోనే ఈ సర్వే చేయడంతో తమ భూములు కంపెనీల కోసం సేకరిస్తారేమోనన్న భయాందోళనలు రైతుల్లో నెలకొన్నాయి. ఇప్పటికే నక్కపల్లి మండలంలో విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్‌కోసం ఏపిఐఐసీ వారు 5వేల ఎకరాలు భూసేకరణ చేశారు. వీటిలో బల్క్ డ్రగ్‌పార్క్ కోసం 2వేల ఎకరాలు, మౌలిక సదుపాయాల కోసం మరో వెయ్యి ఎకరాలు కేటాయించారు. ఇంకా రెండు వేల ఎకరాలు ఏపిఐఐసీ వద్ద అందుబాటులో ఉంది. తాజాగా అర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారు నక్కపల్లి మండలంలో రాజయ్యపేట సమీపంలో పోర్టు ఆధారిత ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తామని కంపెనీకి 2600 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దీనిపై ఏపీఐఐసీ వారు జిల్లా యంత్రాంగానికి భూములు గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఏపిఐఐసీ ద్వారా మరిన్ని భూములు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిలో బాగంగానే గడచిన రెండు రోజుల నుంచి ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో తీరప్రాంతాన్ని ఆనుకుని రాజయ్యపేటకు అతి సమీపంలో ఉన్న గ్రామాల్లో జిరాయితీ, ప్రభుత్వ భూములు గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. నక్కపల్లి తహసీల్దార్ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఏపిఐఐసీ, రెవెన్యూ సర్వే బృందాలు సోమవారం పెదతీనార్ల, దొండవాక గ్రామాల్లో సర్వే నిర్వహించారు. పెదతీనార్లలో సర్వే నంబర్లు 1నుంచి 11,15, 17,18, 19, 29, 30, 31, 32, 33, 34, 38, 75, 80, 83, 84, 85, 87, 90, 91, 100, 103, 108, 117, 118, 120, 121, 122, 123, 124, 125, 133, 134, 135, 137, 138, 139, 144, 186, 206, 207, 208, 210, 211 తదితర సర్వే నంబర్లలో సుమారు 1027 ఎకరాల భూములను గుర్తిస్తున్నట్టు తెలిసింది. పెదతీనార్ల రెవెన్యూ పరిధిలో మొత్తం 69 సర్వే నంబర్లలో ఉన్న భూములను సర్వేచేయనున్నట్లు సమాచారం. ఏపిఐఐసీ ద్వారా మరిన్ని భూములు సేకరించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఏపీఐఐసీ ద్వారా భూసేకరణకు ఈ భూములు సరిపోతాయని (అనుకూలంగా ఉన్నాయని) పంచాయతీ వారికి తెలిపిన సమాచారంలో పేర్కొన్నారు. అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నామని తహసీల్దార్ నర్సింహమూర్తి తెలిపారు. ఏపీఐఐసీ వారికి భవిష్యత్ అవసరాల కోసం ఈ భూములు పనికొస్తాయని నివేదిక సమర్పించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దొండవాక సమీపంలో ఉన్న పెద్ద కొండ, చిన్నకొండలను కూడా సర్వే చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment