కలెక్టరేట్ సిబ్బందికి వైద్య పరీక్షలు
తుమ్మపాల : ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఎన్‌సీడీ –3.0 సమగ్ర కేన్సర్ స్క్రీనింగ్‌లో భాగంగా ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచితంగా వైద్యపరీక్షలు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.ఎం.ఎస్.వి.కె. బాలాజీ అన్నారు. కలెక్టరేట్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టరేట్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించామన్నారు. సాధారణ ఎన్‌సీడీల నివారణ, నియంత్రణ, స్క్రీనింగ్, జనాభా ఆధారిత స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే మధుమేహం, అధిక రక్తపోటు సాధారణ కేన్సర్లు (ఓరల్, బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్లు) స్క్రీనింగ్ సర్వే చేశామని తెలిపారు. మొత్తం 148 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 30 మందిలో రక్తపోటు, 28 మందిలో మధుమేహం గుర్తించి చికిత్సలు సూచించామన్నారు. 28 మంది మహిళలకు బ్రెస్ట్ స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జె.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 13,55,051 మందికి 5,72,457 గృహ సందర్శనలు చేసి సర్వే ద్వారా తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇంతవరకు 19,501 మందికి తనిఖీలు నిర్వహించామన్నారు. 18 ఏళ్లు దాటిన అందరికీ పరీక్షలు నిర్వహిస్తామని, 30 ఏళ్ల వయస్సు గల పురుషులు, మహిళలకు నోటి క్యాన్సర్, 30 ఏళ్ల వయస్సు దాటికి మహిళలకు రొమ్ము–గర్భాశయ క్యాన్సర్ల స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. అసాధారణ కేసులను వైద్య అధికారులు పరీక్షించి అనుమానితులను ఫాస్ట్‌ట్రాక్ చానల్ ద్వారా వైద్య సదుపాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని, ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు డాక్టర్ ఈశ్వర్ రాణి, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ ధనంజయ్, డాక్టర్ పావని, డాక్టర్ జయదీప్, ఎన్‌సీడీ సిబ్బంది మోహన్, రేవతి, శ్యామల, చైతన్న, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment