పథకాల అమలులో అధికారులు విఫలం
తుమ్మపాల : అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, పథకాలపై అవగాహన లేక ప్రజలు దరఖాస్తు కూడా చేసుకోలేకపోతున్నారని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఎంపీ సి.ఎం రమేష్ ఆధ్వర్యంలో జిల్లా డెవలప్‌మెంట్ కో–ఆర్డినేషన్, మోనిటరింగ్ కమిటీ (దిశా) సమీక్ష సమావేశంలో స్పీకర్‌తో పాటు కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా, జెడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయకుమార్, కె.ఎస్.ఎన్.రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై కేంద్ర పభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో అధికారులు విఫలమయ్యారని, అధికారులు తమ శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో ప్రచారం కల్పించి క్షేత్ర స్థాయిలో అవగాహన చేయాలన్నారు. ప్రజలు అధికారుల దగ్గరకు వస్తే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోమంటూ తప్పించుకుంటున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలు జరిగేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించాలన్నారు. ఎంపీ సి.ఎం.రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 58 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటి వివరాలు ప్రజలకు తెలిసేలా, వినియోగించుకునేలా అధికారులు చూడాలన్నారు. పారిశ్రామికంగా జిల్లా ప్రత్యేక స్థానం ఉందని, పథకాలు గూర్చి అధికారులు ముందుగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిపాదనలు అందజేస్తే మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి పాల్గొన్నారు.
29న ప్రధానితో శంకుస్థాపనలు
ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ జిల్లాలో ఉన్న సింహాద్రీ–ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో సంయుక్తంగా చేపట్టనున్న హైడ్రో రూ.లక్ష కోట్ల ప్రొజెక్టు, పాయకరావుపేటలో ఫార్మా ఎస్‌ఈజెడ్ శంకుస్థాపన చేసేందుకు విశాఖ రానున్నట్టు ఎంపీ సి.ఎం.రమేష్ అన్నారు.
సమీక్షలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు
పథకాలపై అవగాహన ఉండాలి : ఎంపీ రమేష్
Comments
Please login to add a commentAdd a comment