ఉపమాక వెంకన్నను దర్శించుకున్న మేల్కోటి చిన్న జీయర్‌స్వా
నక్కపల్లి: కర్ణాటకలోని మేల్కోటికి చెందిన శ్రీ త్రిదండి శఠగోపముని చిన్నరామానుజ జీయర్ స్వామివారు శనివారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మేల్కోటి ఆశ్రమానికి ఉత్తరాధికారిగా ఇటీవల ఆయన సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చకులు పీసపాటి వెంకటశేషాచార్యులు పల్లకిలో భగవద్ రామానుజుల వారిని, మనవాళ్ల మహమునులను,శఠారిలను వేంచేయింపు జేసి ఆలయ మర్యాదలతో జీయర్ స్వామివారికి స్వాగతం పలికారు. బేడామండపం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామిని, భూదేవీ,శ్రీదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను,గోదాదేవి అమ్మవారిని చిన్న జీయర్‌స్వామి దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. అర్చక స్వాములు ఆయనకు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వేంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషాలు, క్షేత్రమహాత్య్మాన్ని వివరించారు.తదుపరి జీయర్‌స్వామి అనుగ్రహభాషణ చేశారు.ఉపమాక దివ్యపుణ్యక్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదన్నారు. పూర్వాశ్రమంలో తాను ఆలయానికి వచ్చానని, దశావతారాల్లో చివరి అవతారమైన కల్కి అవతారంలో గరుడాద్రిపై స్వామివారి స్వయం వ్యక్తమై వెలియడం మనందరి పూర్వజన్మసుకృతమన్నారు.చిన్నజీయర్‌స్వామికి స్వాగతం పలికిన వారిలో దేవస్థానం ఇన్‌స్పెక్టర్ కూర్మేశ్వరరావు, శ్రీవైష్ణవ భక్త బృందానికి చెందిన నండూరి వెంకట రాజగోపాలాచార్యులు, నున్న సుభాస్, పవన్‌కుమార్ ఆచార్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment