అడిగినంత ఇస్తేనే.. ఆధార్‌ మార్పులు | - | Sakshi
Sakshi News home page

అడిగినంత ఇస్తేనే.. ఆధార్‌ మార్పులు

Published Mon, Nov 25 2024 8:20 AM | Last Updated on Mon, Nov 25 2024 8:20 AM

అడిగి

అడిగినంత ఇస్తేనే.. ఆధార్‌ మార్పులు

నర్సీపట్నం:ఆధార్‌ కేంద్రాల్లో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం 9, 10 తరగతులు, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు అపార్‌(ఆటోమేటిక్‌ పర్మినెంట్‌ అకౌంట్‌ రిజిస్టర్‌) నమోదు ప్రక్రియ చేపట్టారు. కొందరు విద్యార్థులకు ఆధార్‌, పాఠశాల రికార్డుల్లో నమోదైన వివరాలు సరిపోలక పోవడంతో అపార్‌ నమోదు సాధ్యం కావడం లేదు. దీంతో అత్యవసరంగా ఆధార్‌ సవరణలు చేయించుకోవాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులు కాసుల వేట మొదలు పెట్టారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ(ఏడీబీ) బ్రాంచ్‌, ఆంధ్రాబ్యాంక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాలతో పాటు నాలగు సచివాలయాల్లో కలిపి ఏడు ఆధార్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వీటిలో ఐదు కేంద్రాలు పనిచేస్తున్నాయి. దీంతో ఎస్‌బీఐ(ఏడీబీ) బ్రాంచ్‌, ఆంధ్రాబ్యాంక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో గల కేంద్రాలకు డిమాండ్‌ పెరిగింది. తమ అవసరాలను ఆసరాగా చేసుకున్న కేంద్రాల నిర్వాహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆధార్‌ కేంద్రాలకు వచ్చే ప్రజలు ఆరోపిస్తున్నారు. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ విద్యార్థులందరికీ అపా ర్‌ నమోదు తప్పనిసరి చేసింది. దీంతో సవరణలు చేసుకునేందుకు విద్యార్థులువస్తుండడంతో ఆధార్‌ నమోదు కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఏడీబీ, ఆంధ్రాబ్యాంక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బయోమెట్రిక్‌, డెమెగ్రాఫిక్‌ వివరాలను ఒకేసారి ఆప్‌టుడేట్‌ చేయించుకుంటే కేవలంరూ.100 చెల్లిస్తే సరిపోతుంది. క్రమ పద్ధతిలో అప్‌టుడేట్‌ చేయాలంటే నెల రోజుల సమయం పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే రూ.300 నుంచి రూ.500 ఇస్తే గంటల్లో ఆధార్‌ అప్‌ టు డేట్‌ అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగానే చెబుతున్నారు. లేదంటే రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కేంద్రాలకు వచ్చే ప్రజలను నిర్వాహకులు దోచుకుంటున్నారు.

గొలుగొండ మండలం జమ్మదేవిపేటకు చెందిన విద్యార్థినికి పాఠశాలలో అపార్‌ సంఖ్య నమోదుకు ప్రయత్నించగా ఆధార్‌లో పుట్టిన తేదీ తప్పుగా ఉండడంతో సాధ్యం కాలేదు. దీంతో ఆమె తండ్రి గంగరాజు పుట్టిన తేదీ మార్పు కోసం నర్సీపట్నంలోని ఓ ఆధార్‌ కేంద్రం వద్దకు మూడు రోజుల కిందట వెళ్లి తప్పును సరిచేయాలని కోరారు. దరాఖాస్తు తీసుకున్న నిర్వాహకుడు టోకెన్‌ నంబర్‌ ఇచ్చి 20 రోజుల తరువాత రమ్మన్నాడు. అత్యవసరం కావడంతో మళ్లీ శనివారం వెళ్లి నిర్వాహకుడు డిమాండ్‌ చేసిన రూ.350 చెల్లించాడు. దీంతో గంటలోగా ఇచ్చేందుకు నిర్వాహకుడు అంగీకరించాడు. ఇక్కడే కాకుండా మరో రెండు కేంద్రాల్లో కూడా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

కేంద్రాల్లో వసూళ్ల దందా

అవస్థలు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు

కొత్తగా ఆధార్‌ నమోదు ఉచితంగా చేయాలి.

బయోమెట్రిక్‌ అప్‌టుడేట్‌, 5–7, 15–17 ఏళ్ల మధ్య వయసు వారికి ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మిగిలిన వారికి రూ.100 రుసుం నిర్ణయించింది.

డెమ్రోగ్రాఫిక్‌ అప్‌టుడేట్‌(పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబరు ఇతర వివరాలకు రూ.50 తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి ఆధార్‌ కేంద్రం నిర్వాహకులు వసూళ్లకు పాల్పడితే కేంద్రాల లైసెన్స్‌ రద్దు చేస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలి. నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తే ఉపేక్షించేది లేదు.

– వి.వి. రమణ, ఆర్డీవో, నర్సీపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
అడిగినంత ఇస్తేనే.. ఆధార్‌ మార్పులు 1
1/1

అడిగినంత ఇస్తేనే.. ఆధార్‌ మార్పులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement