సంఘమిత్ర...సేవా తృష్ణ
ఉచితంగా వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు
వైద్య శిబిరాలు నిర్వహించే సమయాల్లో దివ్యాంగులు వైద్యం పొందేందుకు వస్తుంటారు. వీరిలో అవసరమయిన వారికి సంఘమిత్ర రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ద్వారా సంఘ అధ్యక్షుడు బండారు రామచంద్రరావు రూ.5వేలు విలువైన వీల్ చైర్లు, రూ.10వేలు విలువైన కృత్రియ అవయవాలతో పాటు రూ.10వేలు విలువైన వినికిడి యంత్రాలను అందజేస్తున్నారు.
మాడుగుల నియోజకవర్గంలో గల నాలుగు మండలాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వినిపించే పేరు సంఘమిత్ర రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ. ఈ సోసైటీ ద్వారా సంఘమిత్ర సభ్యులు మెగా వైద్య శిబిరాలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. విశాఖపట్నంలో ప్రముఖ వైద్యులను ఈ వైద్య శిబిరాలకు రప్పించి గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు ఆయా ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడి దినదినం సేవలు విస్తృత పరుస్తున్న ఈ సొసైటీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
కె.కోటపాడు: విశాఖపట్నంలో ప్రముఖ ఈఎన్‌టీ ప్రొఫెసర్ బండారు రామచంద్రరావు స్వగ్రామం కె.కోటపాడు మండలం గొండుపాలెం గ్రామం. ఆయన తన స్నేహితులైన 10 మంది ఉద్యోగులతో కలిసి 20 ఏళ్ల క్రితం నవంబర్ 24న సంఘమిత్ర రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీని ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతంలో కొంతయినా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ ఈ సొసైటీ ఏర్పాటు చేశారు. 10 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘమిత్ర సొసైటీలో నేడు 100 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరంతా సంఘమిత్ర నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా పాల్గొని సహకారం అందిస్తారు. సొసైటీ ప్రారంభించిన నాటి నుంచి సుమారు 210 మెగా, సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలలో కొన్నింటిని దేవరాపల్లి మండలం ఏజెన్సీ గ్రామాల్లోను నిర్వహించి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించారు. అలాగే బాలికలు, మహిళల్లోను రక్తహీనత సమస్య లేకుండా ఉండేందుకు హెచ్‌బీ పరీక్షలను నిర్వహించి, రక్తం వృద్ధికి ఐరన్ సుక్రోజ్ సిరప్‌లతో పాటు మాత్రలను అందిస్తున్నారు.
గ్రామీణ విద్యాజ్యోతి ఉపకార వేతనాలు
ప్రతి ఏటా కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో టాపర్‌లుగా నిలుస్తున్న 100 మంది విద్యార్థులకు సొసైటీ సభ్యులు గ్రామీణ విద్యాజ్యోతి పథకం ద్వారా స్కాలర్‌షిప్ నగదును అందిస్తున్నారు. పదేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు చదువుల్లో పోటీతత్వాన్ని చూపి మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని, జీవన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని అధికారులతో స్ఫూర్తిదాయక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి గౌరవ పురస్కారాలు సంస్థ తరఫున అందిస్తున్నారు.
పల్లె ప్రజలకు అండగా విస్తృత కార్యక్రమాలు
ఉన్నత స్థానాల్లో ఉండి గ్రామీణులకు సేవలు అందిస్తున్న సభ్యులు
ఇప్పటి వరకూ 210 వైద్య శిబిరాలు
సొసైటీ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి
సేవా కార్యక్రమాలతో సంతృప్తి
ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నా. సెలవు రోజుల్లో మా ప్రాంతంలో నిర్వహించే సంఘమిత్ర సొసైటీ ద్వారా నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. పట్టణాల్లో ఉండే ప్రముఖ వైద్యులను ఈ ఉచిత వైద్య శిబిరాలను రప్పించి మెరుగైన వైద్యంతో పాటు మందులు అందించే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ సేవా కార్యక్రమాలతో నాలో ఎనలేని సంతృప్తి కలుగుతుంది.
–బి.మంగపతి, ఉపాధ్యాయుడు, సంఘమిత్ర సభ్యుడు, గొండుపాలెం
10 మందితో మొదలై....
సంఘమిత్ర రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీని 10 మంది తోటి స్నేహితులతో కలిసి ఏర్పాటు చేయాలని 20 ఏళ్ల క్రితం సంకల్పించుకున్నాం. మేం చేస్తున్న సేవలు చూసి గ్రామాల్లో గల స్నేహితులు కూడా సొసైటీలో చేరారు. 20 ఏళ్లలో ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామాల్లో పేదవారి చెంతకు ఖరీదైన స్పెషలిస్ట్ వైద్యం అందించగలిగాం. ఉచితంగా మందులతో పాటు ఖరీదైన కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, దివ్యాంగులకు వీల్‌చైర్‌లను అందించాం. ఈ నెల 24న కె.కోటపాడులో సంఘమిత్ర సొసైటీ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవడం పట్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
–డాక్టర్ బండారు రామచంద్రరావు, సంఘమిత్ర రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు
క్రీడాకారులకు అండగా..
గ్రామాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండగా నిలిచేందుకు సంఘమిత్ర సభ్యులు గ్రామీణ క్రీడాజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ఆయా రంగాల్లో రాణించేందుకు ఉచిత శిక్షణతో పాటు సంబంధిత వసతులు కల్పిస్తున్నట్టు సభ్యులు తెలిపారు. గ్రామాల్లో మన ఊరు–మన చెట్టు కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment