అనంతుని దీపోత్సవం చూతము రారండి
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం రానే వచ్చింది. రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ఉత్సవం ఈ నెల 30న నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీపాలను ప్రత్యక్షంగా వెలిగించేందుకు.. వేడుకను కనులారా వీక్షించేందుకు ఆ రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. – పద్మనాభం
● రేపు అనంత పద్మనాభ స్వామి ఇంట దివ్వెల కొలువు
● సాయంత్రం 5.30 గంటలకు ఉత్సవం ప్రారంభం
ఒకే చోట శైవ, వైష్ణవ ఆలయాలు ఉండడం పద్మనాభం ప్రత్యేకత. అందులోనూ కార్తీకమాసంలో శివ పూజకు అనువైన వాతావరణం కలిగి ఉండడంతో పాటు వైష్ణవ సంప్రదాయం కలిగిన అనంత పద్మనాభుడి గిరి మెట్ల పంక్తిపై శైవ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దీపోత్సవం నిర్వహించడం.. అలనాటి శైవ, వైష్ణవ భక్తుల అద్భుతమైన అనుబంధాన్ని చాటి చెబుతుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వానికి ఒక నిదర్శనం.
ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం
దీపోత్సవం శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. గిరిపైన జేగంట మోగగానే భక్తులు ఒక్కసారిగా దీపాలు వెలిగిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన అనంత పద్మనాభ స్వామి చిన్న ఉత్సవ విగ్రహాలు గిరి దిగువున ప్రథమ పావంచా వద్ద కొలువు తీరుతాయి. గిరిని అధిరోహించే ముందు భక్తులు ప్రథమ పావంచా వద్ద కొలువై ఉన్న అనంతుడి ఉత్సవ విగ్రహాలను దర్శించుకుంటారు. గిరి ప్రథమ పావంచా సన్నిధిలో 12 అడుగుల ఎత్తు ఉన్న శివుని విగ్రహం సాక్షాత్కరిస్తుంది. గిరిపైకి వెళ్లే భక్తులు 1,200 మెట్టు వద్ద కొలువు దీరనున్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలను దర్శించుకుంటారు. ఉత్సవంలో భాగంగా మెట్లకు సున్నం వేశారు. మెట్లకిరువైపులా ఉన్న తుప్పలు, డొంకలు తొలగించారు.దీపాలు వెలగించడానికి అవసమైన నూనె, 5 వేల ప్రమిదలు, 5 వేల వత్తులు సమకూర్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
గిరిపై ఆలయంలోకి ప్రవేశం లేదు
గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి, ఘాట్ రోడ్డు ద్వారా గిరిపైకి భక్తులకు ప్రవేశం లేదని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. ఆలయ శిఖర పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదని తెలిపారు. ఘాట్ రోడ్డుకు ఒక వైపు రక్షణ గోడలు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా భక్తులు వెళ్లకూడదన్నారు.
పద్మనాభం ప్రత్యేకత
అనంత పద్మనాభ స్వామి ప్రాచీన ఆలయాలు భారతదేశంలో రెండు చోట్ల ఉన్నాయి. అందులో ఒకటి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం, రెండోది మన జిల్లాలోని పద్మనాభం గ్రామంలోని గిరిపై ఉంది. ఎక్కడా జరగని విధంగా ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున అనంత పద్మనాభ స్వామి కొండ మెట్ల పంక్తిపై దీపాలంకరణ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. గిరి పాదం నుంచి గిరి శిఖరం వరకు 1,200 మెట్లకిరువైపులా తైల దీపాలంకరణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి.. హైందవ సంప్రదాయ విశిష్టతను ఎల్లెడలా వ్యాపింపజేస్తున్నారు ఈ ప్రాంత భక్త జనం. స్వామి వారి దీపోత్సవంలో పాల్గొంటే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మహిళలు తాము పుణ్యవతులు కావడానికి కార్తీక దీపోత్సవంలో పాల్గొనడమే ఉత్తమమని భావిస్తారు. అందుకే దీపోత్సవం జరిగే రోజు మధ్యాహ్నం నాటికే వీరు పద్మనాభం చేరుకుని దీపాలు వెలిగించడానికి కొండ మెట్లను పోటీ పడి రిజర్వ్ చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment