పీఎం సూర్యఘర్‌తో రాయితీపై సోలార్ యూనిట్
● శతశాతం సౌర విద్యుత్ గ్రామంగా గుల్లేపల్లిని నిలపాలి ● అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
సబ్బవరం: దేఽశ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మండలంలోని గుల్లేపల్లి గ్రామాన్ని సోలార్ మోడల్ గ్రామంగా గుర్తించడంతో గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని శత శాతం సోలార్ గ్రామంగా రూపుదిద్దుకుని, జిల్లాతో పాటు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీ అందిస్తుందన్నారు. దీంతో పాటు మిగిలిన మొత్తానికి అవసరమైతే బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తాయన్నారు. ప్రస్తుతం పెట్టే పెట్టుబడి మూడేళ్లలో తిరిగి వస్తుందన్నారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో వాడకం మినహా, మిగులు విద్యుత్‌ను ఈపీడీసీఎల్‌కు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు నిల్వలు తరిగిపోవడంతో భవిష్యత్తు అంతా పునరుత్పాదక ఇంధన వనరులదేనన్నారు. గ్రామంలో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటుకు డబ్బులు చెల్లించిన వారికి ఫీజిబిలిటీ సర్టిఫికెట్లను అందించారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ సోలార్ యూనిట్ ఏర్పాటుకు కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.70 వేలు వరకు ప్రభుత్వం రాయితీ అందిస్తుందన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని గుల్లేపల్లి గ్రామాన్ని సోలార్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. శత శాతం సోలార్ సాధించిన గ్రామానికి ప్రభుత్వం రూ.కోటి ప్రోత్సాహకంగా అందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు మరిన్ని నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, ఎంపీపీ బోకం సూర్యకుమారి, సర్పంచ్ బండారు మంగ, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, డీపీవో శిరీషారాణి, ఎంపీడీవో పద్మజ, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి.ప్రసాద్, ఈఈ నిరంజన్ అంబేడ్కర్, ఏఈలు వీరేంద్ర, అశోక్, గ్రామ పెద్దలు బోకం రామునాయుడు, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment