జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన కానిస్టేబుళ్లు
● అభినందించిన ఎస్సీ జగదీష్
అనంతపురం: జాతీయ స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో యోగా విభాగంలో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ జి.దీపను ఎస్పీ పి.జగదీష్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. చత్తీస్‌ఘడ్‌లోని భిలాయి పట్టణంలో ఉన్న అగ్రసేన్ భవన్‌లో సెప్టెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకూ ఆల్‌ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్‌లో యోగా పోటీలు నిర్వహించారు. ఇందులో ఆర్టిస్టిక్ యోగా గ్రూపు మహిళా విభాగంలో అనంతపురం మహిళా పోలీస్‌స్టేషన్‌కు చెందిన జి. దీప పాల్గొని కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటారు. అలాగే గుంతకల్లు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్.పులిబాబు ఆర్టిస్టిక్ గ్రూపు పురుషుల విభాగంలో ఐదో స్థానం, ట్రెడిషనల్ యోగాసన పురుషుల విభాగంలో అనంతపురం డీటీసీకి చెందిన ఎం.చలపతి 15వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, ఎస్‌బీ సీఐలు ధరణికిషోర్, క్రాంతికుమార్, ఆర్‌ఐ రాముడు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్‌హాక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్‌ఎస్‌ఐ జాఫర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రేపు
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్సార్ టీఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 4న తాడేపల్లిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ తప్పక హాజరై, విద్యారంగంతో పాటు అసోసియేషన్ బలోపేతానికి చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి.శ్రీధర్‌గౌడ్ కోరారు.
గొడవలకు
దూరంగా ఉండాలి
అనంతపురం: సమస్యాత్మక గ్రామాల్లోని ప్రజలు గొడవలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు మంగళవారం రాత్రి పల్లె నిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సీఐ, ఎస్‌ఐ సమావేశమై మాట్లాడారు. సమస్యలుంటే పోలీసులు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఒక్కసారి కేసుల్లో ఇరుక్కొంటే జీవితాలు నాశనమవుతాయని అన్నారు. అంతేకాక ఈ ప్రభావం కుటుంబసభ్యులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment