రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం

Published Tue, Nov 5 2024 1:43 AM | Last Updated on Tue, Nov 5 2024 1:43 AM

రెడ్‌

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం

అనంతపురం కార్పొరేషన్‌: సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి భయపడేది లేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైపు ఉన్న బలమైన నాయకత్వాన్ని ఆకర్షించేందుకు, భయపెట్టేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఆ రోజు సోనియా గాంధీ, ఈ రోజు చంద్రబాబు, ఎవరికీ భయపడని వ్యక్తే వైఎస్‌ జగన్‌. బెదిరిపోయే వ్యక్తే అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఆయన సీఎం అయ్యేవారు’ అని అన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు కృష్ణవేణి, ఇట్లూరి రవికుమార్‌, శ్రీ సత్యసాయి జిల్లాలో బాలాజీరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చడం దుర్మార్గమన్నారు. అరెస్టులు చేస్తామంటూ సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హెచ్చరికలు చేయడం సరికాదన్నారు. మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తుండటం, మూడో చాప్టర్‌ ఓపెన్‌ చేయబోతున్నామంటూ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడటం దారుణమన్నారు. వెంటనే సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో మట్కా విచ్చలవిడిగా సాగుతున్నా, బెల్ట్‌ షాపులతో మద్యం ఏరులై పారుతున్నా, ఇసుక పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్నా కట్టడి చేయకపోవడం సీఎం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనమన్నారు.

ఎన్ని వేషాలు వేసినా వదలం..

డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ఎన్ని వేషాలు వేసినా చంద్రబాబును వదిలే ప్రసక్తి లేదని ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రబాబు అన్నారు. తిరుపతి లడ్డూ వివాదం, ఎస్సీ నాయకత్వాన్ని అరెస్టు చేయడం, షర్మిలమ్మ ఎపిసోడ్‌ తీసుకురావడం బాబు డ్రామాల్లో భాగమేనన్నారు. జపాన్‌ టెక్నాలజీతో రుషి కొండపై భవనాలు అద్భుతంగా కట్టారని, భూకంపం వచ్చినా ఏమీ కాదని గతంలో చెప్పిన చంద్రబాబు.. నేడు అందుకు విరుద్ధంగా మాట్లాడటం తగదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్దామని, అక్కడ వైఎస్‌ జగన్‌, చంద్రబాబు పాలనపై పోలికలు చూద్దామని సవాల్‌ విసిరారు. బాబు నిర్మించిన తాత్కాలిక భవనాల్లో చదరపు అడుగుకు రూ.15,000 ఖర్చు చేశారని, తాను చెప్పింది అవాస్తవమని నిరూపిస్తే తక్షణం రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ‘గతంలో హైదరాబాద్‌లో లేక్‌ వ్యూ అతిథి గృహానికి ఎంత ఖర్చు చేశారు, కట్టని రాజధాని కోసం జపాన్‌, సింగపూర్‌, కజకిస్తాన్‌, లండన్‌, చైనాకు ఎందుకు వెళ్లి వచ్చారు, ఈ పర్యటనలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు చెప్పాలి’ అని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.5 వేల కోట్లు ఏమయ్యాయో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ విభాగం బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లలో లక్ష మందికి కోత విధించడం, ఉచిత సిలిండర్ల కార్యక్రమంలో డబ్బు కట్టాలని చెప్పడం చూస్తే ఇది మోసపూరిత ప్రభుత్వమని మరోసారి రుజువైందన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త వీరాంజనేయులు, మేయర్‌ వసీం, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎగ్గుల శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు పెన్నోబులేసు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్‌, కార్పొరేటర్లు కమల్‌భూషణ్‌, చంద్రలేఖ, నరసింహులు, మాజీ డైరెక్టర్‌ శోభాబాయి పాల్గొన్నారు.

జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తొలి కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే శివాలయాలలో సందడి నెలకొంది. భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయాలు కాంతులీనాయి. కొత్తశోభ సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో భక్తజనం పులకించిపోయారు. కరుణించి కాపాడు స్వామీ అంటూ వేడుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

కార్తీకం.. తేజోమయం

ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తాం

కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటాం

హామీలు అమలు చేసేదాకా బాబును వదిలే ప్రసక్తే లేదు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం 1
1/4

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం 2
2/4

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం 3
3/4

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం 4
4/4

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement