‘కూటమి’ మూల్యం చెల్లించుకోకతప్పదు
అనంతపురం అర్బన్: కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నందుకు కేంద్రంలోని కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలంటూ బుధవారం కలెక్టరేట్ ఎదుట విశాఖ ఉక్కు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసన దీక్షలు చేపట్టాయి. సమితి కో–కన్వీనర్ యేసురత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ రాజారెడ్డి, కో–కన్వీనర్లు నాగేంద్రకుమార్, సురేష్ మాట్లాడారు. 32 మంది ప్రాణత్యాగంతో నాడు సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డదారిలో కేంద్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధపడిందని మండిపడ్డారు. నాడు పోరాటాలతో సాఽధించుకున్న ఉక్కు పరిశ్రమను నేడు అవే పోరాటాలతో ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక, ప్రజా సంఘాలపై ఉందన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వేగవంతం చేసిందన్నారు. ఉక్కు పరిశ్రమను నష్టాల్లో నెట్టడానికి మోదీ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి పరిశ్రమను మరింత నష్టాల్లోకి నెట్టివేస్తోందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఉక్కు పరిశ్రమను దారదత్తం చేసి వేలాది మంది కార్మికులను రోడ్డు పాలు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. ఉక్కు పరిశ్రమను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఓ వైపు ప్రచారం చేస్తూ... మరోవైపు 4,290 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించే కుట్ర చేయడం దారుణమన్నారు. విశాఖ ఉక్క ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన టీడీపీ, జనసేన పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నిలుపుదలకు ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేయాలన్నారు. లేకుంటే ప్రజాప్రనిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమితి నాయకులు రాజేష్‌గౌడ్, రామాంజి, కృష్ణుడు, చిరంజీవి, వెంకటనారాయణ, నాగరాజు, కుళ్లాయిస్వామి, వేమన, వీరేంద్ర, భాస్కర్ బాబు, కేశవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment