అనంతపురం సిటీ: బదిలీ ఉత్తర్వుల కోసం తరలి వచ్చిన ఉద్యోగులతో జిల్లా పరిషత్ కార్యాలయం బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కిటకిటలాడింది. బదిలీల నోటిఫికేషన్ జారీ కాగానే మొత్తం 274 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 40 మంది ఎంపీడీఓలు, 234 మంది మినిస్టీరియల్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులోనూ ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులు 103 మందిలో ఆరుగురు ఎంపీడీఓలు, 97 మంది మినిస్టీరియల్ ఉద్యోగులు ఉన్నారు. ఆరుగురు ఎంపీడీఓలతో పాటు 97 మంది మినిస్టీరియల్ స్టాఫ్‌ను బదిలీ చేస్తూ జెడ్పీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లు పూర్తి కాకుండా వివిధ కారణాలతో రిక్వెస్ట్ బదిలీలకు మొత్తం 153 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 34 మంది ఎంపీడీఓలు, 119 మంది మినిస్టీరియల్ ఉద్యోగులకు స్థానచలనం కలిగించారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద 27 మంది మినిస్టీరియల్ ఉద్యోగులను బదిలీ చేశారు. వీరందరికీ బుధవారం బదిలీ ఉత్తర్వులు అందించారు. కాగా, బదిలీల ప్రక్రియ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే ఓ ఉద్యోగి క్యాడర్‌ను బట్టి రేటు నిర్ణయించి వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన సదరు ఉద్యోగి కూటమి ప్రభుత్వం రాకతో తనకు ఎదురు లేదని విర్రవీగుతున్నట్లు జెడ్పీ ఉద్యోగులు బాహాటంగా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment