ఇసుక అక్రమ తరలింపు అడ్డగింత
శింగనమల: మండలంలోని పి.జలాలపురం గ్రామ సమీపంలోని వంక నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను శనివారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే, గ్రామస్తులపై పచ్చ పార్టీ నాయకులు ఎదురుతిరగడంతో స్థానికులు నేరుగా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు శింగనమల పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వంకలో ఇసుక తోడుతున్న హిటాచీతో పాటు అక్కడే ఉన్న 5 టిప్పర్లను పట్టుకున్నారు. పోలీసులు గ్రామస్తులతో మాట్లాడుతుండగానే చీలేపల్లి దారి గుండా టిప్పర్లు వెళ్లిపోయాయి. దీంతో హిటాచీని పోలీసులు పట్టుకొని శింగనమల పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రోజూ రాత్రిళ్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్నారు. దీంతో భూగర్భ జలం తగ్గిపోతోందన్నారు. రాత్రిళ్లు ఇసుక టిప్పర్లు చేసే శబ్ధాలతో నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment