అనంతపురం అర్బన్: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడంలో వెనకబడితే ఊపేక్షించబోనని, నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయాల్సిందేనని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డ్వామా అధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ బడ్జెట్‌లో కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఈ అంశంలో వజ్రకరూరు, కూడేరు మండలాలు వెనకబడ్డాయన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న చోట సంబంధిత ఎంపీడీఓలు నివేదిక సిద్ధం చేసి డ్వామా పీడీకి సమర్పించాలని చెప్పారు. ఉపాధి కూలీల హాజరు సంఖ్య పెంపు, వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య పెంచాలన్నారు. బీటీ రోడ్ల పనులను లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. సీసీ కాలువల నిర్మాణంలో పురోగతి సాధించాలని ఆదేశించారు. హార్తికల్చర్‌కు సంబంధించి ప్లాంటేషన్ వారంలోగా పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా జరుగుతున్న పనులను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పారు. మండల స్థాయి అధికారులతో సమీక్షిస్తూ పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ సలీంబాషా, ఉద్యాన శాఖ డీడీ నరసింహారావు, హౌసింగ్ పీడీ శైలజ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment