నడిరోడ్డుపై ఆగిన ‘108’
శింగనమల: అత్యవసర వైద్య సేవల కోసం రోగులను ఆస్పత్రికి తరలిస్తున్న 108 అంబులెన్స్ మార్గ మధ్యంలో మొరాయించింది. వివరాలు... శింగనమల పీహెచ్‌సీ నుంచి రోగులను అత్యవసర వైద్య సేవలకు అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలిస్తున్న 10 అంబులెన్స్... జాతీయ రహదారిపై కొర్రపాడు వద్దకు చేరుకోగానే టైరు పంక్చరు కావడంతో ఆగిపోయింది. స్టెప్నీ టైర్ లేకపోవడంతో కొన్ని గంటల పాటు ప్రాణాపాయ పరిస్థితిలో రోగులు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో తాడిపత్రి నుంచి రోగులను తీసుకుని వస్తున్న 108 అంబులెన్స్‌ను గమనించిన పైలెట్ దానిని ఆపి తన అంబులెన్స్‌లోని రోగులను ఎక్కించి పంపారు. అనంతరం పంక్చర్ అయిన టైరును తీసుకెళ్లి సరిచేయించుకుని సాయంత్రం శింగనమల పీహెచ్‌సీకి చేరుకున్నారు.
యువకుడి బలవన్మరణం
అనంతపురం: నగరంలోని సోమనాథనగర్‌కు చెందిన ఇటికల రాజారామ్‌శెట్టి కుమారుడు జయరాంశెట్టి (25) ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీ టౌన్ సీఐ శాంతిలాల్ తెలిపిన మేరకు... ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న జయరాంశెట్టి ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తనకు బతకాలని లేదని, నాన్న దగ్గరకు వెళ్లిపోతానంటూ తరచూ భార్య జయనందినితో గొడవ పడేవాడు. ఆదివారం సైతం ఇదే తరహాలో గొడవపడిన ఆయన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గమనించిన జయనందిని మేనమామ అడ్డుకుని గది నుంచి బయటకు పిలుచుకుని వచ్చాడు . అయితే అప్పటికే విషపూరిత ద్రావకం తాగి ఉన్నట్లుగా గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆదివారం రాత్రి ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గంలోని మారెంపల్లి కాలనీకి చెందిన నూర్ మహమ్మద్ అలియాస్ నూర్‌బాషా (35)కు భార్య రుక్సానా, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెయింటింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన సోమవారం మారెంపల్లి కాలనీలో సమీపంలోని రేషం తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment