ఈ నినాదం ప్రభుత్వానికి హెచ్చరిక కావాలి
అనంతపురం అర్బన్: ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారంలో కూటమి సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మండిపడ్డారు. డిమాండ్ల సాధన కోసం విప్పిన గళం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక కావాలని పిలుపునిచ్చారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. సంఘం కార్యదర్శి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ గేయానంద్‌తో పాటు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ హాజరై మాట్లాడారు. నిర్ధేశించిన పనులు కాకుండా అదనపు పనులు చేయిస్తుండడంతో ఆశ వర్కర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఎన్‌సీడీసీడీ సర్వే ఏఎన్‌ఎంలు చేయాలని అధికారులు చెబుతూనే ఆశ వర్కర్లతో చేయిస్తున్నారన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి వివరాలను ఓటీపీతో చేయాల్సి ఉంటుందన్నారు. ఏఎన్‌ఎం చేయాల్సిన ఈ పని ఆశ వర్కర్ చేయాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాయదుర్గం, తాడిపత్రి పట్టణాల్లో ఒక్కొక్క ఆశా వర్కర్ పరిధిలో 3 వేలు, 4 వేలు, 6 వేలు చొప్పున జనాభా ఉందన్నారు. గుత్తి పట్టణంలోని 5వ సచివాలయం ఆశ వర్కర్ రేవతికి 6,986 మంది జనాభా ఉన్నారన్నారు. దీంతో పని ఒత్తిడి ఎక్కువై అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఆశ వర్కర్లు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలన్నారు. అనంతరం అధికారులకు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు మాలతి, కోశాధికారి భారతి, నాయకురాళ్లు అక్కమ్మ, హుసేన్‌బీ, భాగ్యమ్మ, అంబిక, నాగమణి, సీఐటీయూ కోశాధికారి గోపాల్, ఉపాధ్యక్షుడు రామాంజినేయులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
న్యాయమైన సమస్యల పరిష్కారంలో కూటమి సర్కార్ మొండి వైఖరి
ఆశ వర్కర్ల ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్
Comments
Please login to add a commentAdd a comment