తీరని కష్టాలు.. కదిపితే కన్నీళ్లు!
ఈమె పేరు హరిజన గంగమ్మ. వయస్సు 87 ఏళ్లు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరులో నివాసముంటున్న ఈమెకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉంది. కొడుకుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కూలి పనికి వెళితే తప్ప పూట గడవదు. దీంతో వారానికి ఒకరు చొప్పున తల్లిని పంచుకుని అన్నం పెడుతున్నారు. ఇక కుమార్తె భర్తను కోల్పోయి తల్లి పంచన చేరింది. తల్లి, కుమార్తె ఒకే రేషన్ కార్డులో ఉండడంతో ఆమెకు పింఛన్ వస్తోందని నాలుగేళ్ల క్రితం గంగమ్మను పింఛన్ జాబితా నుంచి తొలగించారు. ఇటీవల కుమార్తెకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. కనీసం మందుల కొనుగోలుకు సైతం డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇస్తే పింఛన్ వస్తుందని తమ ఊళ్లో సారోళ్లు చెబితే ఆశతో ఇంత దూరం వచ్చానని కన్నీటితో తన గోడు వెల్లబోసుకుంది.
.... ఈ పరిస్థితి ఒక్క హరిజన గంగమ్మదే కాదు... జిల్లా వ్యాప్తంగా చాలా మంది అన్ని విధాలుగా అర్హత ఉన్నా... సామాజిక భద్రత పింఛనఅందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు పింఛన్ మంజూరు చేయాలంటూ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. దీంతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి బాధితులు పోటెత్తుతున్నారు. వీరిలో ఏ ఒక్కరిని కదిపినా... వారి కష్టాలు కన్నీటి రూపంలో బయటపడుతున్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కష్టం. మాటల్లో చెప్పలేని వేదన.
●
Comments
Please login to add a commentAdd a comment