రబీ వేరుశనగ సాగుకు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: రబీలో నీటి వసతి కింద వేరుశనగ పంట విత్తుకునేందుకు డిసెంబర్ 15 వరకు అనుకూల సమయమని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగులోకి రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. ఇటీవల మంచి వర్షాలు కురవడంతో ఆలస్యం చేయకుండా విత్తుకోవాలని సూచించారు. తొలిదశలో పంటకు చీడపీడలు, తెగుళ్లు ఆశించకుండా ఉండేందుకు కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నారు. విత్తుకున్న 24 నుంచి 48 గంటల్లోపు ఎకరాకు ఒకటి లేదా ఒకటిన్నర లీటర్ చొప్పున కలుపు మందు 20 శాతం పెండీమిథాలిన్‌ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. రసం పీల్చు పురుగు ఉధృతి తగ్గించేందుకు పొలం చుట్టూ నాలుగైదు వరుసల్లో సజ్జ, జొన్న విత్తనాలను రక్షణ పంటగా విత్తుకోవాలన్నారు. పంట కాలంలో సిఫారసు చేసిన మోతాదులో మందుల పిచికారీ, ఎరువుల వాడకం, నీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
● ఖరీఫ్ సీజన్ సాగులో ఉన్న పత్తికి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గులాబీరంగు కాయ తొలచు పురుగు (పింక్ బౌల్ వార్మ్) ఆశించే పరిస్థితి ఉందని, పురుగు ఉనికి గుర్తించడానికి ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోజుకు 8 రెక్కల పురుగులు ఉన్నట్లు గమనిస్తే లీటర్ నీటికి 2 మి.లీ ప్రొపినోపాస్ లేదా 2.5 మి.లీ క్లోరిపైరిపాస్ లేదా 2 మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా 1 మి.లీ ఇండాక్సికార్బ్ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ కలిపి పిచికారీ చేయాలన్నారు.
● కందిలో మారుకామచ్చల పురుగు, పచ్చపురుగు ఉధృతిని బట్టి లీటర్ నీటికి 0.3 మి.లీ బట్టిక్లోరాన్ ట్రినిలిప్రోల్ లేదా 0.4 గ్రాములు ఎమామెక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment