రైతు రుణాలు రీషెడ్యూల్ చేయండి
అనంతపురం సిటీ: జిల్లాలో ఏడు మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించిన నేపథ్యంలో ఆయా మండలాల్లోని రైతుల పంట రుణాలు రీషెడ్యూల్ చేసి ఆదుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ బ్యాంకర్లకు సూచించారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్‌లో ఉన్న డీపీఆర్‌సీ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలు తిరిగి చెల్లించకపోయినా రీషెడ్యూల్ చేసి కొత్తగా మంజూరు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలు మంజూరు చేసి నిర్దేశిత లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. మెప్మా కింద ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీకి సంబంధించి జిల్లాకు 2,010 లింకేజ్ చేయాలని లక్ష్యం విధించగా 1,441 లింకేజ్ చేశారన్నారు. ఈ ఏడాది కేటాయించిన లక్ష్యానికి మించి మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్టాండప్ ఇండియా పథకం కింద గత ఏడాది 30 శాతం, ఈ ఏడాది ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే రుణాలు మంజూరు చేశారని, అర్హులైన అందరికీ రుణాలు ఇవ్వాలని సూచించారు. ఎల్‌డీఎం, మెప్మా పీడీ, డీఆర్‌డీఏ పీడీలు బ్యాంకర్లతో ఏడు రోజుల్లోగా సమావేశాలు నిర్వహించి లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకునే స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.35 వేల చొప్పున రుణం అందజేయాలన్నారు. జిల్లాలోని 577 పంచాయతీల్లోనూ ప్రభుత్వ పథకాలు వంద శాతం అమలు కావాలని స్పష్టం చేశారు. అర్హులకు రుణాలు అందించడంలో ప్రతిభ కనబరచిన బ్యాంకర్లు, ఎల్‌డీఎంను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, ఎల్‌డీఎం నరసింగరావు, నాబార్డు ఏజీఎం అనూరాధ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి, జిల్లా పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ శ్రీధర్, ఫిషరీస్ డీడీ శ్రీనివాసనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్య, డీపీఓ నాగరాజు నాయుడు, మెప్మా పీడీ విశ్వజ్యోతి, వివిధ బ్యాంకుల సీఈఓలు, మేనేజర్లు పాల్గొన్నారు.
‘ఓడీఎఫ్’ జిల్లాగా తీర్చిదిద్దుదాం
అనంతపురం అర్బన్: జిల్లాను ఓడీఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత)గా తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ‘మన మరుగుదొడ్డి– మన గౌరవం’ నినాదంతో డిసెంబరు 10వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశుభ్రత అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. జిల్లాలో మరుగుదొడ్ల మరమ్మతుల కార్యాచరణను నిర్వహించడం, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల సుందరీకరణ, పారిశుధ్య వీరులకు సన్మానం, తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మరుగుదొడ్లను వినియోగించుకునేలా ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పాఠశాల్లలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, డ్వామా, వైద్య, విద్యాశాఖల అధికారులు చురుగ్గా పనిచేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వినోద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment