ఆగని సర్కారు వేధింపులు
● సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నరేంద్రనాథ్ రెడ్డిపై కేసు
గార్లదిన్నె: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కారు వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పాలనా వైఫల్యాలపై పెట్టిన విమర్శలను సానుకూలంగా స్వీకరించి, లోటుపాట్లను అధిగమించాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ నరేంద్రనాథ్‌రెడ్డిపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచిత పోస్టులు పెట్టారంటూ టీడీపీ నాయకులు చేసిన ఫిర్యాదుపై ఆగమేఘాలపై స్పందించి అనంతపురంలో నివాసముంటున్న నరేంద్రనాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ కౌలుట్లయ్య ఆధ్వర్యంలో శింగనమల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణ పేరుతో స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. భావప్రకటన స్వేచ్ఛపై దమనకాండ సాగుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
సర్వేకు సహకరించండి
అనంతపురం రూరల్: ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌పీసీఐ (బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్) సర్వేకు జిల్లావాసులు సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఆధార్ లింక్ చేయించుకుంటే పలు పథకాలకు అర్హులవుతారన్నారు. విపత్తులు సంభవించి నష్టపోయిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించడానికి వీలవుతుందన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారనే వివరాలతో పాటు ఇంటి నంబర్, ఫొటో అప్‌లోడ్ చేస్తారన్నారు.
నేడు హెచ్‌ఎం
పదోన్నతుల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీల పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ బుధవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్ సంస్థ ఒక యూనిట్‌గా, తక్కిన ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీలు ఒక యూనిట్‌గా పదోన్నతులు చేపట్టనున్నారు. ఇప్పటికే తుది సీనియార్టీ జాబితాను విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్వీస్ రిజిస్టర్, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని డీఈఓ ప్రసాద్‌బాబు సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా స్థానాలను భర్తీ చేయనున్నారు.
13 పోస్టుల భర్తీ..
6 గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులతో పాటు 7 ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో మూడు గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులు, రెండు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. మునిసిపాలిటీలకు సంబంధించి రాయదుర్గంలో రెండు, గుంతకల్లులో ఒక గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టు ఖాళీ ఉండగా, తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీల్లో ఒక్కో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టు ఖాళీగా ఉంది.
‘అపార్’పై ప్రత్యేక దృష్టి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ‘అపార్’ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రిన్సిపాళ్లను ఇంటర్ బోర్డు ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగిన జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అపార్ నంబర్ జనరేట్ చేయడంలో ప్రైవేట్ కళాశాలలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదో తరగతి మార్కుల జాబితా ఆధారంగా పేరు సరి చేయాలన్నారు. పుట్టిన రోజు తేదీలో తప్పులున్నట్లయితే నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్ పొంది లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ సర్టిఫికెట్ ద్వారా మార్పులు చేయాలన్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా వివరించారు. మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 21లోపు చెల్లించాలన్నారు. 22 నుంచి రూ.వెయ్యి అపరాధ రుసుంతో చెల్లించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సమగ్ర శిక్ష ఏపీఓ నారాయణస్వామి, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, సోషల్ వెల్ఫేర్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment