రాయదుర్గం: కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిందే తడవుగా అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ వ్యాపారం ప్రారంభించారు. అధికారులు దాడులు చేస్తున్నా ఆగడం లేదు. ఒక ప్రాంతంలో చర్యలు తీసుకుంటే వెంటనే మరో ప్రాంతంలోకి మకాం మారుస్తున్నారు. సహజ వనరుల్ని చెరబట్టి దొరికినకాడికి దోచుకుంటున్నారు. ఉచిత ఇసుక పాలసీ పేరిట తమ జేబులు నింపుకుంటున్నారు.
రాత్రికి రాత్రే తరలించేస్తారు..
రాయదుర్గం నియోజకవర్గంలోని వేదావతి హగరి నదితో పాటు వాగులు, వంకలు, అటవీ ప్రాంతాల్లో లభించే ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. గుమ్మఘట్ట మండలం భూపసముద్రం, గుమ్మఘట్ట, రాయదుర్గం మండలం జుంజురంపల్లి, గుండ్లపల్లి, వేపరాళ్ల, కణేకల్లు మండలం రచ్చుమర్రి, కళేకుర్తి, బిదురుకుంతం, మాల్యం, బొమ్మనహాళ్ మండలం ఏలంజి, లింగదహాళ్, కొలగానహళ్లి, ఉద్దేహాళ్, బండూరు, కళ్లుదేవనహళ్లి, బొల్లనగుడ్డం, డీ హీరేహాళ్ మండలం బాదనహాళ్, నాగలాపురం, తిమ్మలాపురం ప్రాంతాల్లో లభించే నాణ్యమైన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా సరిహద్దులకు తరలించి డంప్‌లుగా పేర్చుతున్నారు. రాత్రి వేళ బళ్లారి, బెంగళూరు, చెళ్లకెర తదితర ప్రాంతాలకు తోలుతున్నారు. టిప్పర్ ఇసుకను రూ.70 వేల నుంచి రూ.లక్ష దాకా విక్రయిస్తూ నిత్యం రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యం వంద ట్రిప్పుల దాకా ఇసుక తరలిపోతున్నట్టు తెలుస్తోంది.
‘సెబ్’ రద్దుతో అక్రమాలకు తెర..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెబ్ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. అక్రమ మద్యం, ఇసుక, గంజాయి కట్టడికి చర్యలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమార్కుల ఆట కట్టించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ‘సెబ్’ను రద్దు చేసింది. దీంతో అక్రమాలు మళ్లీ జడలు విప్పుకున్నాయి. ఈ క్రమంలో విలువైన ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోకముందే అక్రమార్కులకు ముకుతాడు వేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుకను ప్రజా అవసరాలకు మాత్రమే ఉచితంగా వినియోగించాలి. దాని ముసుగులో ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు చేపడతాం. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. కల్యం వద్ద అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌ను సీజ్ చేయించాం. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, మైనింగ్ డీడీ,
అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment