మోడల్ స్కూల్‌లో చేరిన ఉద్యోగులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉత్కంఠకు తెర పడింది. ఆ ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి మెరిట్ కమ్ రోస్టర్ ద్వారా ఎంపిక చేసిన ఉద్యోగులను ఉరవ కొండ మోడల్ స్కూల్‌లో చేర్చుకోకుండా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు అడ్డుకుంటూ బెదిరింపులకు దిగిన వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. వార్డెన్ పోస్టుకు బంగి సునీత, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు మాదిగ రాజేశ్వరి ఎంపికయ్యారు. కలెక్టర్ జారీ చేసిన నియామక ఉత్తర్వులతో విధుల్లో చేరేందుకు ఈనెల 11న వెళ్లిన ఆ ఇద్దరు ఉద్యోగులను స్థానిక టీడీపీ చోటా నాయకులు అడ్డుకున్నారు. ఏకంగా మోడల్ స్కూల్‌లోకి వచ్చి ప్రిన్సిపాల్ ఎదుటే హెచ్చరించారు. నియామక పత్రాలు చింపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ ఇద్దరు వెనుతిరిగారు. కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఈ క్రమంలో ఈనెల 13న ‘సాక్షి’లో ‘మా వారిని కాదని ఎలా ఇస్తారు?’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అయినా ఏమాత్రం తగ్గని టీడీపీ నాయకులు అదేరోజు డీఈఓ కార్యాలయానికి వచ్చి సమగ్ర శిక్ష ఏపీసీ నాగరాజుకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. వీరి బెదిరింపులపై 14న ‘సాక్షి’లో ‘తగ్గని తెలుగు తమ్ముళ్లు’ శీర్షికతో మరో కథనం వెలువడింది. ఈ కథనాలు జిల్లా వ్యాప్తంగా దుమారం రేపాయి. అధికారులపై ఒత్తిళ్లు పెరగడంతో ఆ మరుసటి రోజే పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌ను చేర్చుకున్నారు. వార్డెన్‌ను మాత్రం చేరనీయకుండా టీడీపీ నాయకులు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసులను ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో బాధితురాలు మరోమారు జిల్లా స్థాయి స్పందనకు వచ్చి జాయింట్ కలెక్టర్‌ను కలిసి విన్నవించగా.. మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఉరవకొండలో అరాచకం’ శీర్షికతో మరో కథనం వెలువడింది. దీంతో స్పందించిన రాష్ట్ర అధికారులు డీఈఓ, సమగ్రశిక్ష ఏపీసీకి ఆదేశాలు జారీ చేశారు. జీసీడీఓ వాణీదేవిని రంగంలోకి దింపారు. ఆమె స్వయంగా ఉరవకొండ మోడల్ స్కూల్‌కు వెళ్లి బంగి సునీతను విధుల్లో చేర్చుకునేలా ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అయితే ఈ సమయంలోనూ కొందరు టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అవుతోందని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దంటూ జీసీడీఓ వారికి చురకలంటించి వార్డెన్‌ను చేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని ‘తమ్ముళ’్లకు అధికారుల చురకలు
Comments
Please login to add a commentAdd a comment