సాయి కీర్తనం.. భవిష్యత్ నిర్దేశనం
ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయం సత్యసాయికీర్తనలతో ప్రతిధ్వనించింది. సత్యసాయిబాబా 99వ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం సాయికుల్వంత్ సభా మందిరంలో మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈశ్వరమ్మ ఇంగ్లిష్ మీడియం, సత్యసాయి ప్రైమరీ, అనంత పురం మహిళా క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులు పూర్ణ కలశాలు చేతబూని మేళతాళాలు, బ్రాస్ బ్యాండ్‌తో సత్యసాయి యజుర్ మందిరం నుంచి సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి వరకు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ స్వరాలు పలికించారు. మృదుమధురమైన సంగీతంతో అందరినీ ఆకట్టుకున్నారు. సత్యసాయి అనంతపురం మహిళా క్యాంపస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్వరి పాటిల్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు సతీమణి హిమ వాహిణితో కలసి తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. డాక్టర్ రాజేశ్వరి పాటిల్ ప్రారంభోపన్యాసం చేశారు. మహిళాలోకం పట్ల సత్యసాయి చూపిన ఆదరణను వివరించారు.
భవిష్యత్ మహిళలదే
భవిష్యత్ అంతా మహిళల చేతుల్లోనే ఉంటుందని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద అన్నారు. మహిళా దినోత్సవంలో ఆమె కీలక ఉపన్యాసం చేశారు. మహిళలకు భవిష్యత్‌ను నిర్దేశించారు. మహిళలు ఇప్పటికే కుటుంబం, సమాజం, జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, పురుషులతో సమానంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారన్నారు. ప్రతి మహిళా తన సామర్థ్యాలపై నమ్మకంతో కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని ఎంచుకున్న రంగంలో ముందుకు సాగితే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు.
ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment