ప్రభుత్వ పాపం.. వర్సిటీలకు శాపం
అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఎస్కేయూ, జేఎన్‌టీయూ అనంతపురం వీసీలను నిర్బంధంగా రాజీనామా చేయించారు. అప్పటి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కే. హుస్సేన్ రెడ్డి, జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావును రాజీనామా చేయాలని అధికారికంగానే కోరారు. దీంతో తక్షణమే వారు రాజీనామా చేశారు. అనంతరం ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీగా ప్రొఫెసర్ అనిత, జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీగా ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావును నియమించారు.
ప్రభుత్వ ఘనకార్యంతో దుస్థితి..
గత ఐదు నెలలుగా ఇన్‌చార్జ్ వీసీలతోనే వర్సిటీల పాలన సాగిస్తున్నారు. వర్సిటీల్లో పూర్తి స్థాయి వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. కమిటీల్లో వర్సిటీ తరఫున నామినీ, యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్), రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో నామినీ ప్రకారం ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ ముగ్గురు సమావేశమై, మూడు పేర్లను ప్రతిపాదిస్తారు. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు గవర్నర్ నియమిస్తారు. కాగా, ఇప్పటికే వీసీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను కూడా స్వీకరించింది. వాటిని స్క్రూటినీ చేసి సెర్చ్ కమిటీలను నియామకం చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ఒకే సారి 16 యూనివర్సిటీల వీసీలతో ప్రభుత్వం రాజీనామా చేయించడంతో యూజీసీ నామినీ నియామకంలో ఇక్కట్లు ఎదురువుతున్నాయి. కమిషన్ నామినీలుగా అంతమందిని ఒకే దఫా నియామకం చేయాలంటే నిపుణుల కొరత ఉండడమే ఇందుకు కారణం. ముందుచూపు లేకుండా కూటమి ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్లే నేడు ఈ దుస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు.
లోకల్ రాజకీయాలు..
ఇన్‌చార్జ్ వీసీలుగా ఆయా వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫసర్లనే నియమించడంతో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉండే ప్రొఫెసర్లపై కక్ష సాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయి వీసీలుగా ఇతర వర్సిటీలకు చెందిన వారిని నియమించడంతో అంతర్గత రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారని విద్యావేత్తలు అంటున్నారు. ఏదిఏమైనా దీర్ఘకాలికంగా ఇన్‌చార్జ్ వీసీలతో పాలన సాగించడం వర్సిటీల పురోగతికి ఆటంకంగా మారుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఈ విషయంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఎస్కేయూ, జేఎన్‌టీయూల్లో ఐదు నెలలుగా ఇన్‌చార్జ్‌ల పాలన
అధికారంలోకి వచ్చీ రాగానే కక్షగట్టి రెగ్యులర్ వీసీలతో రాజీనామాలు
ముందుచూపు లేకుండా సర్కారు తీసుకున్న నిర్ణయంతో నేడు చిక్కులు
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా త్వరితగతిన స్పందించాలని నిపుణుల సూచన
నియామకం.. మరింత ఆలస్యం!
జేఎన్‌టీయూ, ఎస్కేయూలకు కొత్త వీసీల నియామక ప్రక్రియలో మరింత జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం జేఎన్‌టీయూ పాలకమండలి సమావేశం జరగ్గా.. ‘వీసీ సెర్చ్ కమిటీ’లో వర్సిటీ నామినీకి సంబంధించిన అంశం ప్రస్తావించకపోవడం గమనార్హం. వాస్తవానికి నామినీ ఎంపికే ప్రధాన అంశంగా సమావేశం నిర్వహించినప్పటికీ ఆ విషయం కనీసం చర్చకు కూడా రాలేదు. ఇదే క్రమంలో తక్కిన అంశాలపై కూడా చర్చ జరగలేదు. దీంతో జేఎన్‌టీయూ వీసీ నియామకం మరింత ఆలస్యం కానుంది. ఇక.. బుధవారం జరిగే ఎస్కేయూ పాలకమండలి సమావేశంలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రెండు వర్సిటీల పాలకమండలి సమావేశాలూ మంగళవారం జరగాల్సి ఉన్నప్పటికీ ఎస్కేయూలో జమున అనే ఉద్యోగి మరణించడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. దీంతో పాలకమండలి సమావేశం బుధవారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment