పరారీలో పేకాట నిర్వాహకుడు
శింగనమల: మండలంలోని ఇరువెందల గ్రామ శివారున స్థావరం ఏర్పాటు చేసి పేకాట ఆడిస్తున్న నిర్వాహకుడు పరారీలో ఉన్నాడని సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ 26 మంది పట్టుబడిన విషయం తెలిసిందే. రూ.13,18,560 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 23 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జూదరులను సోమవారం ఉదయం అరెస్ట్ చూపించారు. అనంతరం శింగనమల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. తాడిపత్రికి చెందిన ఖాదిర్ వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించేందుకు పేకాట నిర్వహణను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో తనకు పరిచయమున్న ప్రముఖలను ఫోన్ చేసి రప్పించుకుని ముళ్లపొదలను అడ్డగా చేసుకుని పేకాట ఆడించసాగాడు. తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో స్థావరాలు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో శింగనమల మండలం ఇరువెందల గ్రామ శివారులో పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్న సమాచారం అందుకున్న ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటసులు పర్యవేక్షణలో ఆదివారం రాత్రి తనిఖీలు చేపడితే పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. జూదరులను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.
కారులో మంటలు
అనంతపురం: జిల్లా కేంద్రంలోని రాంనగర్ అంబేడ్కర్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాయదుర్గం పట్టణానికి చెందిన ఓబులేసు, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అనంతపురానికి కారులో వచ్చారు. ఆస్పత్రికి చేరుకునేందుకు రాంనగర్ మీదుగా అంబేడ్కర్ బ్రిడ్జిపై వెళ్తూ ఏసీ ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. అప్రమత్తమైన దంపతులు వెంటనే పిల్లలను తీసుకుని కారు దిగారు. దగ్గర్లో ఉన్న ఫైర్ సిబ్బంది గమనించి అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే కారులో ఉన్న సీట్లు దగ్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment