విషపూరిత గడ్డి తిని గొర్రెలు మృతి
కళ్యాణదుర్గం రూరల్ : క్రిమి సంహారక మందు పిచికారీ చేసిన గడ్డి తిని గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గోవిందప్ప రోజులాగే సోమవారం తన గొర్రెలను మేపునకు తోలుకెళ్లాడు. గ్రామ సమీపంలోనే ఓ వ్యవసాయ తోట వద్ద వారం రోజుల క్రితం ముల్లంగి పంటలో కలుపు నివారణకు క్రిమి సంహారక మందు పిచికారీ చేసి ఉన్న విషయం తెలియని ఆయన మధ్యాహ్నం అటుగా తన గొర్రెలను తోలాడు. దీంతో ఆ గడ్డిని తిన్న 8 గొర్రెలు మృతి చెందాయి. మరో 10 గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనతో రూ.1.50 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు.
ఎర్రగుంటలో
టీడీపీ నేతల దౌర్జన్యం
కుందుర్పి: మండలంలోని ఎర్రగుంట గ్రామంలో టీడీపీ నాయకుల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఏ ఒక్క రైతుకూ ఉపాధి పనులు కల్పించలేదని, మెట్ట భూముల్లో పండ్ల మొక్కల సాగును సైతం టీడీపీ మద్దతుదారులకే మంజూరు చేశారని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు రామచంద్రప్ప, జయసింహ, రమేష్, బసవరాజు, నరసింహులు, చౌడప్ప తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం టీడీపీకి చెందిన అల్లరి మూక రాత్రికి రాత్రే చించేసిందని, ఇదేమని ప్రశ్నిస్తే భౌతికదాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటిౖకైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
యువకుడిపై కత్తితో దాడి
తాడిపత్రి టౌన్: డబ్బు విషయంగా ఘర్షణ చోటు చేసుకుని యువకుడిపై కత్తితో దాడి జరిగిన ఘటన తాడిపత్రిలో సంచలనం రేకెత్తించింది. వివరాలు... స్థానిక బీహెచ్ మహల్ సినిమా థియేటర్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో వెంకటేష్, బాబా ఫకృద్దీన్, మరికొందరు డబ్బు విషయంగా గొడవ పడ్డారు. ఆ సమయంలో బాబా ఫకృద్దీన్ కత్తి తీసుకుని వెంకటేష్ గొంతు కోశాడు. స్థానికులు అడ్డుకోవడంతో బాబాఫకృద్దీన్, మిగిలిన వారు పరారయ్యారు. క్షతగాత్రుడిని అక్కడి వారు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యాయత్నం
గుత్తి రూరల్: మండలంలోని పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన రైతు రఘురామిరెడ్డి సోమవారం పురుగుల మందు తాగాడు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న రఘురామిరెడ్డిని గుర్తించి వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment