గంజాయి ముఠా అరెస్ట్
గుంతకల్లుటౌన్: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి రైలు ద్వారా అక్రమంగా గంజాయిని దిగుమతి చేసుకుని..దాన్ని కారులో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి తరలిస్తున్న నలుగురు నిందితులను గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మూడు కిలోల గంజాయి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.మనోహర్ వివరాలు వెల్లడించారు. బళ్లారి నగరానికి చెందిన గంగారాము, రాచకొండ వెంకటసాయి, చెత్రగుడి రామక్రిష్ట, గుంతకల్లు షికారీకాలనీకి చెందిన షికారీ దుర్గేష్ కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నారు. వెంకటసాయి భువనేశ్వర్ నుంచి గంజాయిని రైలులో అక్రమంగా తెప్పించి.. దానిని బళ్లారి, గుంతకల్లుకు చెందిన విక్రేతలకు అమ్ముతున్నాడు. వన్‌టౌన్ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు సోమవారం ఉదయం స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. నలుగురు నిందితులు క్విడ్ కారు (కేఏ36ఎన్9280) లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని వన్‌టౌన్ పీఎస్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. ఒడిశాలో కిలో రూ.5 వేల ప్రకారం కొనుగోలు చేసి.. ఇక్కడికి తీసుకువచ్చిన తరువాత 5 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారు. అనంతపురం కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారిని రిమాండుకు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో సహకరించిన ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ జయప్రకాష్ రెడ్డి, సిబ్బందికి సీఐ కృతజ్ఞతలు తెలిపారు.
3 కిలోల గంజాయి, కారు సీజ్
Comments
Please login to add a commentAdd a comment