కలెక్టరేట్‌లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం
అనంతపురం అర్బన్: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. కూడేరు, బుక్కరాయసముద్రం మండలాలకు చెందిన రైతులు సహజ పద్ధతిలో పండించిన వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలను విక్రయానికి అందుబాటులో ఉంచారు. పలువురు ఉద్యోగులు, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులు వీటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... తాము సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి క్రిమి సంహారక మందులు, ఫర్టిలైజర్లను వాడకుండా సహజ పద్ధతుల్లో పండిస్తున్నట్లు తెలిపారు.
రైళ్ల భద్రతపై దృష్టి సారించాలి
గుంతకల్లు: రాబోవు రుతుపవనాలను దృష్టిలో ఉంచుకుని రైళ్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, భద్రతను నిర్ధారించడపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన గుంతకల్లు డీఆర్‌ఎం విజయ్‌కుమార్‌తోపాటు జోన్ పరిధిలోని డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో రైళ్ల కార్యకలాపాలు, భద్రతపై సమీక్షించారు. అధికారులు ఎప్పుటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రసుత్తం చేపడుతున్న పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలన్నారు. రైళ్ల రాకపోకల్లో సమయ పాలన పర్యవేక్షించాలన్నారు. ట్రాక్ మెయింట్‌నెన్స్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. భద్రత విధానాలపై సిబ్బందికి కౌన్సిలింగ్ ఇస్తుండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్లు,
టిప్పర్ పట్టివేత
గార్లదిన్నె: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని తరలింపుదారులపై కేసులు నమోదు చేసినట్లు గార్లదిన్నె ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. శింగనమల మండలం కల్లుమడి గ్రామ శివారులోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు, కల్లూరు సమీపంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను మండల కేంద్రం వద్ద 44వ జాతీయ రహదారిపై అడ్డుకుని సీజ్ చేసినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment