వందనాలమ్మా..!
● నెలాఖరు నుంచి హెచ్చెల్సీకి నీటి నిలుపుదల
● ఈ ఏడాది జిల్లాకు గణనీయంగా నీరు
● అదనపు కోటాతో కలిసి 32.345 టీఎంసీల కేటాయింపు
అనంతపురం సెంట్రల్: జిల్లా వరప్రదాయిని తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదల నిలిచిపోనుంది. ఈ నెలాఖరుతో కోటా పూర్తి కానుండడంతో నీటిని బంద్ చేస్తున్నట్లు టీబీ బోర్డు అధికారులు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గణనీయంగా 32.345 టీఎంసీల నీటిని జిల్లాకు కేటాయించారు. ఇప్పటి వరకూ 30.987 టీఎంసీలు చేరాయి. ఖరీఫ్ ప్రారంభంలో కాస్త ఆందోళన కలిగించినా తర్వాత కురిసిన భారీ వర్షాలు,తుపాన్ల కారణంగా తుంగభద్ర జలాశయానికి భారీ స్థాయిలో వరద వచ్చింది. జలాశయంలో 182.783 టీఎంసీలు నీటి లభ్యత కాగా దామాషా ప్రకారం 30.354 టీఎంసీలు కేటాయించారు. కేసీ కెనాల్ వాటా మరో 2 టీఎంసీలు అదనంగా రావడంతో ఈ ఏడాది మొత్తం 32.354 టీఎంసీలకు చేరింది.
ఆదుకున్న తుంగభద్ర..
తుంగభద్ర నీరు ఈ ఏడాది జిల్లా రైతాంగం, ప్రజానీకాన్ని ఆదుకుందనే చెప్పవచ్చు. ఆశించిన దానికి మించి నీరు రావడంతో ఆయకట్టుకు పుష్కలంగా అందించడమే కాకుండా చెరువులను నింపారు. తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కేటాయించినా దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 3.637 టీఎంసీలు, ఎంపీఆర్‌లో 1.510 టీఎంసీలు, చిత్రావతిలో 8.4764, చాగళ్లు 0.816, పెండేకళ్లు 0.277 టీఎంసీల నీరు ఉన్నాయి. త్వరలో హెచ్చెల్సీ కోటా పూర్తి కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో ఎస్‌ఈ ఎన్. రాజశేఖర్ మాట్లాడారు. తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో నీరు వచ్చిందన్నారు. ఈ నెలాఖరుతో మొత్తం కోటా పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సరిపడా నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉందని చెప్పారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు అందిస్తామని చెప్పారు.
నిలిచిపోయిన ఇన్‌ఫ్లో
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట వద్ద ఉన్న తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం తగ్గింది. ఈ నెల 5 నుంచి డ్యాంలోకి ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. 11,243 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు. 18 రోజుల వ్యవధిలో 16 టీఎంసీలను కాలువలకు విడుదల చేశారు. 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో బుధవారం సాయంత్రానికి 1,620.28 అడుగుల వద్ద 62.117 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment