‘పీడీ’ వ్యవహారంపై దుమారం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకుంటూ విద్యాశాఖ, సమగ్రశిక్ష కార్యాలయాలను శాసిస్తున్న సాధారణ ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) వ్యవహారంపై విద్యాశాఖ, సమగ్రశిక్షలో దుమారం రేగింది. ఈయన మితిమీరిన జోక్యంపై బుధవారం ‘సాక్షి’లో ‘పట్టి ‘పీడీ’స్తున్నారు..’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. విద్యాశాఖ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర విద్యాశాఖ ఉద్యోగులు, అధికారుల వరకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. బయట జిల్లాల నుంచి సమగ్రశిక్ష, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఇక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఫోన్లు చేసి మరీ పీడీ గురించి ఆరా తీశారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ దృష్టికీ వెళ్లింది. కలెక్టర్ వినోద్‌కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. పాఠశాల విద్య ఆర్జేడీ (కడప) శామ్యూల్ స్పందించి, జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. పీడీ వ్యవహారంపై రిపోర్ట్ ఇవ్వాలంటూ డీఈఓను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ ఒక సాధారణ పీడీ ఈ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతుండటాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణించారు. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు సదరు ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు తెచ్చేలా పీడీ వ్యవహారాలు ఉంటున్నాయని నేరుగా పీఏలకు ఫోన్లు చేసి చెప్పారు. పీడీ వ్యవహారంపై విచారణకు ఇద్దరు అధికారులను నియమించనున్నట్లు తెలిసింది.
ఆ సంఘం నేతదీ అదే తీరు!
అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘంలోని ఓ నాయకుడి తీరుకూడా ఇదే రకంగా ఉంటోందని డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయాల ఉద్యోగులు వాపోతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ ఉపాధ్యాయుల సమస్యలపై కనీసం మాట్లాడని ఆ నాయకుడు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నాడు. కొందరి ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకుంటూ పైరవీలు చేస్తున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. ఆయన సామాజికవర్గానికి చెందిన చాలామంది టీచర్లు ప్రజాప్రతినిధులకు చాలా దగ్గరగా ఉంటున్నా... విద్యాశాఖలోకానీ, ఇటు సమగ్రశిక్షలో కానీ పెత్తనం చేయడం లేదంటున్నారు. ఇలాంటివారిని ప్రజాప్రతినిధులు అదుపు చేయాలని, లేదంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారని చెబుతున్నారు.
విద్యాశాఖలో జోరుగా చర్చ
ఉన్నతాధికారుల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment