రీ–సర్వే పకడ్బందీగా
నిర్వహించాలి
● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: జిల్లాలో రీ–సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమర్శలు, వివాదాలకు తావివ్వకుండా నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రీ–సర్వే పక్కాగా నిర్వహించాలని చెప్పారు. రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్లు బాధ్యతగా పని చేయాలన్నారు. ప్రతి శుక్రవారం చుక్కల భూములు, 22–ఏ భూములకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. డీ.హీరేహాళ్ మండలంలో చుక్కల భూముల ఫైళ్ల పెండింగ్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పరిష్కార వేదిక ఆర్‌ఓఆర్‌కు సంబంధించి గుత్తిలో 168 పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో ఎక్కువ భాగం మిగులు భూమి కావడంతో నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. త్వరలో ఇవి పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూములు, ఫిర్యాదులను ప్రతి రోజూ సమీక్షిస్తామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ మలోల, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్, తదితరులు పాల్గొన్నారు.
కాలితో తన్ని..
కులం పేరుతో దూషించి..
దళితుడిపై ‘పచ్చ’ కార్యకర్త దాడి
పెద్దవడుగూరు: దళితుడిపై టీడీపీ కార్యకర్త దాడి చేసిన ఘటన మండల పరిధిలోని కోనాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామంలో మంగళవారం దేవర ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి పొలి చల్లిన వస్తువులకు బుధవారం రాత్రి నిర్వహించిన వేలంపాటలో దళితుడు గంగన్న పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అతడిపై టీడీపీ కార్యకర్త ప్రసాద్ రెచ్చిపోయాడు. ‘వేలంపాటలో పాల్గొనేందుకు నీకెంత ధైర్యం రా’ అంటూ కాలితో తన్నాడు. కులం పేరుతో దూషించాడు. అక్కడ ఉన్న వారు ప్రసాద్‌కు నచ్చజెప్పి గంగన్నను అతని ఇంటికి పంపించారు. ఇంతలోనే ఇంటికి వచ్చిన గంగన్న కుమారుడు రామాంజనేయులు తండ్రికి జరిగిన అవమానం గురించి తెలుసుకుని ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రసాద్‌తో పాటు మరి కొంతమంది గంగన్న ఇంటిపై దాడికి దిగారు. వస్తువులను బయటకు విసిరేశారు. పోలీసులు గ్రామానికి చేరుకొని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజినేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment