జీజీహెచ్‌లో వెల్‌నెస్ సెంటర్
అనంతపురం కార్పొరేషన్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డీఈఐసీలో ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌ను బుధవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు. మధుమేహం, రక్తపోటు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, తదితర సూచనలు సలహాలను వెల్‌నెస్ సెంటర్‌లో అందిస్తారన్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు వెల్‌నెస్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, సామాజిక వైద్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మధు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆదినటేష్ తదితరులు పాల్గొన్నారు.
12 శాతం లోపు తేమ
ఉంటేనే కందుల కొనుగోలు
● మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి
అనంతపురం అగ్రికల్చర్: 12 శాతం లోపు తేమ ఉన్న నాణ్యమైన కందులనే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఖరీఫ్‌లో రైతులు పండించిన కందులను కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.7,550 ప్రకారం కొనుగోలు చేసే ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌కేల్లో 2 వేల మంది వరకు రైతులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. మిగతా రైతులు కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి అన్నారు. మరిన్ని వివరాలకు కంట్రోల్ రూం–8500292992 లేదా 8978381841 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని, కందులు పండించిన రైతులు బహిరంగ మార్కెట్‌లో ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు.
రైతు ఆత్మహత్యల
వివరాలు పంపండి
● అధికారులకు జేడీఏ
ఉమామహేశ్వరమ్మ ఆదేశం
అనంతపురం సెంట్రల్: జిల్లాలో రైతు ఆత్మహత్యల వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, మండల, డివిజన్‌స్థాయి కమిటీలు పరిశీలించి వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏడీలు, ఏఓలతో ఆమె సమావేశమై మాట్లాడారు. 2024–25 రబీ సీజన్‌లో ఈ–పంట నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకూ 2,09,462 ఎకరాలకు గాను 1,69,663 ఎకరాల్లో పంట నమోదు కార్యక్రమం పూర్తయిందన్నారు. అలాగే 90,774 ఎకరాలకు ఈ–కేవైసీ చేశారన్నారు. ప్రస్తుతం పప్పుశనగ కోత దశలో ఉన్నందున ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కిసాన్ డ్రోన్‌లకు సంబంధించి కొత్త గ్రూపులను ఏర్పాటు చేయాలని, ఆసక్తి ఉన్న వారికి పైలట్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైతుల భూములకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో గ్రామాల మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment