ఫీజు పోరు మార్చి 12కు వాయిదా
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ‘ఫీజు పోరు’ను మార్చి 12వ తేదీకి వాయిదా వేసినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ర్యాలీల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిరాకరించడంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు మేలుకుని విద్యార్థులకు రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలను తక్షణం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
‘కాసుల సర్వే’పై విచారణ
అనంతపురం అర్బన్: సర్వే చేసేందుకు సర్వేయర్ డబ్బులు వసూలు చేయడాన్ని సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘‘కాసుల సర్వే’’ కథనానికి ఆయన స్పందించారు. పామిడి మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన సర్వేయర్ డబ్బు వసూలు వ్యవహారంపై విచారణ చేయిస్తున్నట్లు వెల్లడించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.
అంతర్జాతీయ
స్కేటింగ్ పోటీలకు ఎంపిక
గుత్తి: పట్టణానికి చెందిన రమేష్ రెడ్డి, శ్రీదేవి దంపతుల కుమారుడు రిత్విక్ రెడ్డి అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. వివరాలు.. పట్టణంలోని వివేకానంద పాఠశాలలో యూకేజీ చదువుతున్న రిత్విక్ రెడ్డి గుత్తి స్కేటింగ్ అకాడమీలో మాస్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో తర్ఫీదు పొందాడు. తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ జరిగిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇందులో రిత్విక్ రెడ్డి ప్రతిభ కనబరచడంతో నిర్వాహకులు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు స్కేటింగ్ మాస్టర్ రాజశేఖర్ చెప్పారు. త్వరలో విదేశాల్లో జరిగే పోటీల్లో రిత్విక్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
కల్తీ పాల యూనిట్ సీజ్
అనంతపురం: కల్తీ పాల యూనిట్‌ను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. రాప్తాడు మండలం ఎం. బండమీద పల్లి గ్రామానికి చెందిన ఎర్రగుంట రామిరెడ్డి ఇంట్లో కల్తీ పాల యూనిట్‌పై సోమవారం విజిలెన్స్ అధికారులు మెరుపుదాడి చేశారు. పామ్ ఆయిల్, ఉప్పు, మాల్టోడైక్సిట్రన్ పౌడర్‌తో చిక్కని ద్రవం తయారు చేసి లీటరు పాలపై రూ. 10 అదనంగా సంపాందించాలనే ఆశతో కల్తీ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ పాలు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కల్తీ పాల యూనిట్‌ను సీజ్ చేసి, పాల నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారి వైబీపీటీఏ ప్రసాద్ హెచ్చరించారు.
ప్రశాంతంగా పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సోమవారం ‘పర్యావరణ విద్య’ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25,798 మంది విద్యార్థులకు గాను 25,037 మంది హాజరయ్యారు. 761 మంది గైర్హాజరయ్యారు. కన్వీనర్, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ఎం. వెంకటరమణనాయక్ మూడు కేంద్రాలను పరిశీలించారు. డీఈసీ సభ్యులు నాలుగు పరీక్ష కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కళశాలల అధ్యాపకులు 18 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment