బ్యాక్‌లాగ్ పోస్టుల్లో అర్హులకు అన్యాయం
అనంతపురం అర్బన్: బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అర్హులకు అన్యాయం జరిగిందని, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌కు దివ్యాంగులు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూభవన్ కింద ఉన్న దివ్యాంగుల వద్దకు కలెక్టర్ స్వయంగా వచ్చి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న మాట్లాడుతూ బ్యాక్‌లాగ్ పోస్టుల్లో కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు అధికారుల విచారణలో వెల్లడైందని, ఇందుకు కారకులైన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాగా, ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, శిరీష, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 418 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని...
● తమ భూమిపై వేరొకరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని మనోహర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కంబదూరు మండలం ములకనురు గ్రామ పొలం సర్వే నంబరు 781లో తమకు 16.48 ఎకరాల భూమి ఉందన్నారు. అయితే ఈ భూమిని ముగ్గురు వ్యక్తుల పేరున అక్రమంగా ఆన్‌లైన్‌లో ఎక్కించడంతో పాటు పాసు పుస్తకాలు ఇచ్చారని చెప్పారు. విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు.
● తమ భూమిని ఆక్రమించారని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన లక్ష్మిదేవి ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 370లో 3.51 ఎకరాలు, 372–3బీలో 1.14 ఎకరాలు మొత్తం 4.65 ఎకరాలు ఉందన్నారు. ఇందులో 2.65 ఎకరాలను ఆక్రమించారన్నారు. సర్వే కోసం చలానా కట్టినా అధికారులు సర్వే చేయడం లేదని చెప్పారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ వినోద్‌కుమార్‌కు దివ్యాంగుల ఫిర్యాదు
‘పరిష్కార వేదిక’కు 418 వినతులు
Comments
Please login to add a commentAdd a comment