హంద్రీనీవా లైనింగ్ పనులు అడ్డుకుంటాం
అనంతపురం కార్పొరేషన్: హంద్రీనీవా సంరక్షణ సమితి ఏర్పాటు చేయడంతో పాటు ఆయకట్టు రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి లైనింగ్ పనులను అడ్డుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీకి నిధులు సమకూర్చిన ఆర్‌వీఆర్, బీఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌సీ కంపెనీలు సంపాదించుకోవాలంటే హైవే పనులు చేసుకోవాలని, లైనింగ్ పనులు చేస్తే మాత్రం ప్రాణాలు ఒడ్డయినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కుప్పంకు నీరు తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్సార్ చలువతో హంద్రీ–నీవాలో నీరు పరుగులు పెట్టడంతో గతంలో కూలీలుగా ఉన్న వారు నేడు రైతులుగా స్థిరపడ్డారన్నారు. ముందుగా ఆయకట్టు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు బ్రాంచ్ కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టి, చివరి ఆయకట్టుకు నీరు రాకపోతే లైనింగ్ పనులు చేస్తారనీ.. కానీ, చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా రైతుల పొట్ట కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా డీపీఆర్‌లో గవర్నర్ ఆమోదంతో రూపొందించిన ఓ అగ్రిమెంట్‌ను చంద్రబాబు ఉల్లంఘిస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 10 శాతం కమీషన్ చంద్రబాబు, మరో 10 శాతం ఎమ్మెల్యేలు తీసుకునేందుకు సిద్ధపడి జిల్లా రైతులను ఎండబెట్టాలని చూస్తున్నారని వాపోయారు. లైనింగ్ పనులతో హిందూపురంలో 300 గ్రామాలు, రాప్తాడులో 100 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాకు నీరివ్వాలని గాలేరు నగరి (వైఎస్సార్ జిల్లా) నుంచి రాయచోటి నియోజకవర్గం మీదుగా పుంగనూరు బ్రాంచ్ కాలువకు రూ.3,500 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకువచ్చారని, ఇప్పటికే రూ.1,500 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. హంద్రీ నీవా లైనింగ్ పనులకు ఖర్చు చేసే రూ.1,000 కోట్లు అక్కడ ఖర్చు చేస్తే చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు 80 టీఎంసీల నీరు అందుతాయన్నారు.
మంత్రి పయ్యావులకు తగునా?
‘హంద్రీ–నీవా మొదటి దశలో ప్రధాన కాలువను వెడల్పు చేసుకుంటున్నారు. ఎందుకయ్యా మంత్రి పయ్యావులా.. హిందూపురంపై శీతకన్ను’ అని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు కమీషన్ వస్తే చాలని, రైతుల ప్రయోజనాలు అవసరం లేదని దుయ్యబట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మేలుకుని లైనింగ్ పనులు జరగకుండా అడ్డుకోవాలని హితవు పలికారు. రైతులు తిరగబడితే ప్రభుత్వాలే కూలిపోయాయని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో కామారుపల్లి సర్పంచ్ లోకనాథ్ రెడ్డి, రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, రాప్తాడు కన్వీనర్ సాకే వెంకటేష్, రామగిరి మండల కన్వీనర్ మీనుగ నాగరాజు, పాపంపేట మాదన్న, బీ యాలేరు మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఎత్తులు
వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment