ఆర్టీసీ ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
బెళుగుప్ప: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ప్రాణ సంకటంలోకి తోసింది. బెళుగుప్ప మండలం నక్కలపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... రాయదుర్గం నుంచి బెళుగుప్ప మండలం నక్కలపల్లి మార్గంలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ తీగలు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రాయదుర్గం నుంచి బెళుగుప్ప మీదుగా అనంతపురానికి ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు నక్కలపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారి షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు ఎగిసి పడుతూ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరిస్తూ బస్నును వెంటనే ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నిప్పు రవ్వలు ఎగిసి పడడంతో ఎండుగడ్డికి మంటలు వ్యాపించాయి. విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు ఆ శాఖ అధికారులకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం మంచిదే అయినా.. అన్ని రోజులు ఇలాగే ఉండవని, ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ తీగల ఎత్తు పెంచాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment