![ఏపీ జట్టు జూడో కోచ్‌గా చిగిచెర్ల పీడీ ప్రతాపరెడ్డి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09dmm203-110045_mr-1739131842-0.jpg.webp?itok=0e0EGdyG)
ఏపీ జట్టు జూడో కోచ్‌గా చిగిచెర్ల పీడీ ప్రతాపరెడ్డి
ధర్మవరం రూరల్: జాతీయ స్థాయి జూడో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు కోచ్‌గా చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ ప్రతాపరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఆనం రామకిషోర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరిగే 38వ జాతీయ క్రీడా పోటీల్లోల ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
పామిడి: స్థానిక వెంగమనాయుడు కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. శనివారం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి శ్రీనివాసరెడ్డి వెళ్లాడు. దర్శనం చేసుకొని అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తలుపులు ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించిన దుండగులు... బీరువాలోని 20 తులాల బంగారు నగలను అపహరించారు. సమాచారం అందుకున్న సీఐ యుగంధర్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫేక్ కాల్
పుట్టపర్తి టౌన్: స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్ పేరుతో దుండగుడు ఓ డాక్టర్‌కు ఎరవేశాడు. ఆన్‌లైన్ ద్వారా ట్రేడ్‌లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని ఎర వేశాడు. ఈ ఫోన్‌కాల్ స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..పట్టణంలో సత్యసాయి క్లినిక్ నడుపుతున్న డాక్టర్ గోపాల్‌రెడ్డికి ఆదివారం ఉదయం 6300805117 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యత్తి తాను మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. ట్రేడ్ లైసెన్స్ జనవరి 31తో ముగిసిందని, ఆన్‌లైన్ ద్వారా రెన్యూవల్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. అయితే అప్పటికే డాక్టర్ గోపాల్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్‌తో పరిచయం ఉండటంతో ఆ వాయిస్ కమిషనర్‌ది కాదని గుర్తించారు. తాను ఎలాంటి ట్రెడ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకోలేదని, పైగా తనకు కమిషనర్ తెలుసని చెప్పడంతో దుండగుడు ఫోన్‌కాల్ కట్ చేశాడు. వెంటనే గోపాల్‌రెడ్డి కమిషనర్ ప్రహ్లాద్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫేక్ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ఫేక్ కాల్స్ వస్తే రికార్డు చేసి 9515133115 నంబర్‌కు పంపాలని పట్టణ వాసులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment