![ప్రశాంతంగా ప్రాక్టికల్ పరీక్షలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10atpc73a-110011_mr-1739212751-0.jpg.webp?itok=kN9xMhzP)
ప్రశాంతంగా ప్రాక్టికల్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఒకేషనల్ విద్యార్థులకు రెండోవిడతగా ప్రారంభం కాగా, జనరల్ విద్యార్థులకు తొలివిడత ప్రారంభమయ్యాయి. ఉదయం జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 56 కేంద్రాల్లో జరిగాయి. జనరల్ విద్యార్థులు 2,799 మందికి గాను 2,761 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,285 మందికి గాను 1,139 మంది హాజరయ్యారు. 146 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 54 కేంద్రాల్లో జరిగాయి. జనరల్ విద్యార్థులు 2,019 మందికి గాను 1,991 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 956 మందికి గాను 922 మంది హాజరయ్యారు. 34 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ నాయక్ నాలుగు కేంద్రాలు, డీఈసీ సభ్యులు ఆరు కేంద్రాలను పరిశీలించారు.
కోర్టులో లొంగిపోయిన
ఫైనాన్స్ కంపెనీ మేనేజర్
ఉరవకొండ: పట్టణంలోని కనకదుర్గా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో దాదాపు రూ.60 లక్షలు విలువ చేసే 1,130 గ్రాముల బంగారాన్ని మాయం చేసిన ఘటనలో నిందితుడు, కంపెనీ జనరల్ మేనేజర్ జ్వాలా చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉరవకొండ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఉరవకొండ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దుర్గాకల్యాణి ఈనెల 24 వరకూ జ్యుడీ షియల్ రిమాండ్ విధించారు. ఘటనపై సదరు ఫైనాన్స్ కంపెనీ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు జనవరి 26న ఉరవకొండ అర్బన్ పీఎస్‌లో కేసు నమోదైంది. కేసులో ఏ–1గా కంపెనీ మేనేజర్ పల్లా ప్రశాంత్‌కుమార్, ఏ–2గా అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశులు, ఏ–3గా కంపెనీ ఆడిటర్ రామాంజినేయులు, ఏ–4గా చంద్రశేఖర్‌రెడ్డి, ఏ–5గా గుర్నాథ్‌రెడ్డి ఉన్నారు. కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
నకిలీ టీసీతో
ఎస్కేయూలో అడ్మిషన్
● టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడిపై గవర్నర్‌కు ఫిర్యాదు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో నకిలీ టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్)తో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు నగరగిరి కిరణ్‌కుమార్ అడ్మిషన్ పొందారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు వాసు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నకిలీ టీసీతో అడ్మిషన్ పొందడంతో మెరిట్ విద్యార్థికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వెంటనే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఎస్కేయూ ఉన్నతాధికారులను గవర్నర్ కార్యాలయం ఆదేశించినట్లు తెలిపారు. వర్సిటీ అధికారులు పారదర్శకంగా సమాచారం ఇవ్వాలని, లేకుంటే జరగబోవు పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment