![సమస్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ang37a-110006_mr-1739212751-0.jpg.webp?itok=DB6syatx)
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..
అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించండంటూ అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్నతో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 405 అర్జీలు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ శివ్ నారాయణ్ శర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు.
వినతుల్లో కొన్ని...
● అనంతపురం గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డు సమీపంలో పట్టాభూమిని కొందరు ఆక్రమించి గుడిసెలు వేశారని స్వామి, ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 80, 90, 91, 92లో తమకు రెండు ఎకరాలు పొలం ఉందని, సర్వే నంబరు 93లో పోరంబోకు స్థలం ఉందని చెప్పారు. కొందరు వ్యక్తులు పోరంబోకుతో పాటు పట్టా స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు వేశారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్వామి వాపోయాడు.
● భూ సమస్యపై రెండేళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం చూపలేదంటూ కంబదూరు మండలం రాళ్లఅనంతపురం గ్రామానికి చెందిన నజీర్ ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 366–4లో తాను సాగు చేసుకుంటున్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమికి డి.పట్టాను గతంలోనే మంజూరు చేశారని చెప్పాడు. అయితే ఈ భూమికి సంబంధించి 1బీ, అడంగల్ రావడం లేదని, న్యాయం చేయాలని కోరాడు.
● తన భర్త కేశప్ప గత ఏడాది జూలై 19న మరణించాడని, పింఛను మంజూరు చేయాలని బుక్కరాయసముద్రం మండలం అనంతసాగర్ కాలనీకి చెందిన నారాయణమ్మ విన్నవించింది. అదే విధంగా ఉరవకొండ గాంధీ చౌక్‌కు చెందిన సుంకమ్మ తన సమస్యను అధికారులకు చెప్పుకుంది. తన భర్త 2023 జూలై 27న మరణించడంతో పింఛను రద్దు చేశారని తెలిపింది. తనకు ఏ ఆదరువు లేదని పింఛను మంజూరు చేయించాలని కోరింది.
పరిష్కారవేదికలో ప్రజల విన్నపాలు
అధికారులకు 405 వినతులు
ఈ దివ్యాంగుని పేరు జి.వాసుదేవ శాస్త్రి. అనంతపురం నగర పరిధిలోని రుద్రంపేట బైపాస్‌లో నివాసముంటున్నాడు. సోదరుడు ప్రభుత్వ ఉద్యోగి అనే కారణంతో ఇతని దివ్యాంగ పింఛన్ను ఆరేళ్ల క్రితం తొలగించారు. ప్రస్తుతం ఆయన వివాహం చేసుకుని వేరుగా ఉంటున్నాడు. హౌస్ హోల్డ్‌లోనూ విభజన అయ్యింది. ప్రస్తుతం వాసుదేవశాస్త్రి తన తల్లితో కలిసి ఉంటున్నారు. జీవనం చాలా కష్టంగా ఉందని, పింఛను మంజూరు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయంటూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నకు అర్జీ సమర్పించాడు. స్పందించిన అసిస్టెంట్ కలెక్టర్.. వాసుదేవ శాస్త్రికి పింఛను మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
![సమస్యలు పరిష్కరించండి మహాప్రభో.. 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10ang37b-110006_mr-1739212751-1.jpg)
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..
Comments
Please login to add a commentAdd a comment