![రాప్తాడులో రౌడీ రాజ్యం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10atpc113-600514_mr-1739212750-0.jpg.webp?itok=oxyvTKfI)
రాప్తాడులో రౌడీ రాజ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: పరిటాల కుటుంబం రాప్తాడులో రౌడీరాజ్యం నడిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త చాకలి నరసింహులుపై ఆదివారం జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాకలి నరసింహులును సోమవారం తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నరసింహులుపై దాడి ఘటనను మొత్తం మీడియా ప్రచారం చేసిందన్నారు. అయితే, 24 గంటలు గడవకముందే కేసు నీరుగార్చేందుకు పరిటాల కుటుంబం కుట్ర పన్నిందన్నారు. రాత్రికి రాత్రి ధర్మవరం ఆస్పత్రిలో వైద్యులను మాట్లాడుకుని, టీడీపీ కార్యకర్త చెన్నప్పపై దాడి జరిగింది.. ఆయనకు ఆరుకుట్లు పడ్డాయంటూ హైడ్రామాకు తెర తీశారన్నారు. ఆగమేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసులు గుంతపల్లి ఆనందరెడ్డిని రిమాండ్‌కు తరలించారని విమర్శించారు. చెన్నప్పపై అసలు దాడే జరగలేదని, ఎల్లో మీడియాలో సైతం ఎక్కడా రాలేదని గుర్తు చేశారు.
దోపిడీ బయట పడకూడదనే..
హంద్రీ–నీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనుల్లో రూ. వంద కోట్లు కమీషన్లు దండుకునే పన్నాగానికి పరిటాల సునీత తెరతీశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. లైనింగ్ పనులు చేపడితే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదముందని, దీనిపై నెలరోజులుగా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈనెల 12న తూముచెర్లలో సభ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈ క్రమంలో సభను అడ్డుకోవాలనే దురుద్దేశంతో నరసింహులుపై టీడీపీకి చెందిన చెన్నప్ప, శ్రీరాములు మరో నలుగురు దాడి చేసి కొడవలితో నరికారన్నారు.
సునీతపై చర్యలు తీసుకోవాలి
అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిటాల సునీతపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని, దాడికి ప్రేరేపించిన శ్రీరామ్‌పై కేసు నమోదు చేయాలని ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెన్నానదిలో ఇసుకను అమ్ముకున్నారని, మట్టిని అమ్ముకుని ఆలమూరు కొండకు గుండు కొట్టించారని మండిపడ్డారు. ఖూనీ కేసుల్లో సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కక్కలపల్లి టమాట మండీలో కేజీకి రూపాయి కమీషన్ దండుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్‌షాపులు పెట్టించారని, అధికారంలోకి రాగానే 2 వేల మంది ఉద్యోగులను తీయించి కడుపులు కొట్టారని విమర్శించారు.
ప్రజలు తిరగబడతారు..
చాకలి నరసింహులుపై
దాడి కేసును నీరుగార్చే కుట్ర
హంద్రీ–నీవా సభను అడ్డుకునేందుకే దాడి
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం
పోలీసులు తాము వేసుకున్న ఖాకీ చొక్కాకు విలువ కడుతున్నారా అని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. పరిటాల గుమ్మానికి వాచ్‌మెన్లు, గుమాస్తాలు కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బాధితుల పక్షాన కాకుండా నేరస్తుల పక్షాన నిలబడతారా? అని మండిపడ్డారు. చట్టం అధికార పార్టీ చుట్టమైతే ప్రజలు తిరగబడతారనే సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. గుంతపల్లి ఘటనపై సంపూర్ణ విచారణ జరిపించాలని, అక్రమ కేసు నమోదుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, డీజీపీని డిమాండ్ చేశారు. సమావేశంలో కనగానపల్లి, ఆత్మకూరు ఎంపీపీలు కుంపటి భాగ్యలక్ష్మీ, హేమలత, కనగానపల్లి, రాప్తాడు, అనంతపురం రూరల్, రామగిరి మండలాల కన్వీనర్లు నాగముని, బండి పవన్, గోవిందరెడ్డి, సాకే వెంకటేశ్, మీనుగ నాగరాజు, యూత్ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నీరుగంటి నారాయణరెడ్డి, నాయకులు మామిళ్లపల్లి అమర్‌నాథ్‌రెడ్డి, జూటూరు శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment