సాక్షి అమలాపురం: తమ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సేవలతోనే వలంటీర్లు బదులిస్తున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి ఏటిగట్లు తెంచుకుని ఊళ్లపై పడిపోకుండా తీసుకునే రక్షణ చర్యల్లో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఏటిగట్లను రేయింబవళ్లు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నపుడు ఏటిగట్ల రక్షణ చాలా ముఖ్యం. ఆ ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించిన సందర్భాలు గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నో ఉన్నాయి.
వరదల సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 534.73 కి.మీల పొడవునా ఉన్న ఏటిగట్ల పరిరక్షణ గతంలో ప్రభుత్వ యంత్రాంగానికి తలకుమించిన భారంగా ఉండేది. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో ఇంత పొడవున ఏటిగట్లను పర్యవేక్షించడం సాధ్యం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వందలాది మంది వలంటీర్లు ఏటిగట్లను పర్యవేక్షిస్తూ పైఅధికారులకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు.
సమాచారం తక్షణం చేరవేత
గత ఏడాది భారీ వరదలకు రాజోలులోని నున్నవారిబాడవ వద్ద గట్టు దాటి నీరు ప్రవహిస్తున్న విషయాన్ని తొలిసారిగా గుర్తించింది వలంటీర్లే. వారిచ్చిన సమాచారంతో అధికారులు వేగంగా రక్షణ చర్యలు చేపట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది కూడా ఏటిగట్ల పర్యవేక్షణ బాధ్యతలను 740 మంది వలంటీర్లకు అప్పగించారు. ప్రతి అర కిలో మీటర్‌కు ఒక వలంటీర్‌ను నియమించారు. వీరు ఏటిగట్ల వద్ద రేయింబవళ్లు కాపలాగా ఉంటూ వరద ఉద్ధృతి, గట్ల పటిష్టతకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం పైఅధికారులకు అందిస్తున్నారు.
ముంపు గ్రామాల్లో సేవలు
ఏటిగట్ల పర్యవేక్షణ ఒక్కటే కాకుండా వరద ముంపుబారిన పడిన లంక గ్రామాల్లో వలంటీర్లు పలు రకాల సేవలందిస్తున్నారు. ముంపు బాధితులను గుర్తించి, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో సహాయపడుతున్నారు.
వారికి భోజన సదుపాయల కల్పన, నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో చొరవ చూపుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం, అయినవిల్లి వంటి వరద ప్రభావం అధికంగా ఉన్న మండలాల్లోని లంక గ్రామాల్లో వీరు చురుగ్గా సేవలందిస్తున్నారు. కష్టసమయంలో ఆసరాగా నిలబడి ప్రజల మన్ననలు పొందుతున్నారు.
నాడు తక్కువగా సిబ్బంది
గతంలో గోదావరి వరద సమయంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తరువాత ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సహాయంగా ఉండేవారు. ఒక హెడ్‌వర్క్స్ ఏఈ తన పరిధిలో సుమారు 10 నుంచి 15 కి.మీ.ల పొడవున ఏటిగట్టు బాధ్యత చూసేవారు. వీరికి లష్కర్లు సహాయం అందించేవారు. ఇరిగేషన్ శాఖలో కొన్నేళ్లుగా లష్కర్ల కొరత ఉంది.
అప్పట్లో ఏటిగట్లకు కన్నాలు పడినా, కుంగిపోయినా, గండ్లు పడే అత్యవసర సమయాల్లో సమాచారం ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యమయ్యేది. ఈ కారణంగానే 2006 గోదావరి వరదలకు అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడి స్థానికులు పెద్దఎత్తున నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
నిరంతరం అప్రమత్తంగా..
గోదావరి ఏటిగట్ల వద్ద వలంటీర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వారి పరిధిలోని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. గతేడాది వారిచ్చిన సమాచారంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కూడా వారు పర్యవేక్షణ పనిలో నిమగ్నమయ్యారు. – పువ్వాడ విజయ్ థామస్, డీడీవో, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment